సాక్షి, బెంగళూరు: స్టేషన్‌కి పిలిపించి దళిత యువకున్ని కొట్టి, మూత్రం తాగించిన అమానవీయ ఘటనలో చిక్కమగళూరు జిల్లా గొణిబీడు పోలీసుస్టేషన్ ఎస్‌ఐ అర్జున్‌పై కేసు నమోదైంది. కిరగుంద గ్రామానికి చెందిన పునీత్ అనే యువకుడు ఒక వివాహితతో మాట్లాడటం వల్ల వారి సంసారంలో విభేదాలు వచ్చాయి. ఆ మహిళ భర్త ద్వారా ఈ సంగతి ఎస్సైకి తెలిసి పునీత్‌ను స్టేషన్‌కి పిలిపించి కులం పేరుతో దూషించటంతో పాటు మూత్రం తాగించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసు ఉన్నతాధికారులు ఆ ఎస్సైపై చర్యలు ప్రారంభించారు.
ఇష్టానుసారం కొట్టాడు
పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ తనను ఇష్టానుసారం కొట్టాడని బాధితుడు మీడియాకు తెలిపాడు. లాక్‌డౌన్ ఉన్న కారణంగా తన కుటుంబసభ్యులు ఎవరూ రావడానికి కుదరలేదన్నారు. తీవ్రంగా కొట్టడం వల్ల నేలపై మూత్రం కారిందని, దానిని నాలుకతో నాకించాడని, అతను చెప్పిన పని చేసినప్పటికీ ఇంటికి పంపించలేదన్నారు. రాత్రి 10 గంటల వరకు నిర్బంధించాడన్నారు. రాత్రి 10 గంటలకు తన మామ వచ్చి తీసుకెళ్లాడన్నారు. తనపై ఎవరూ కేసు పెట్టలేదని, ఎస్సై ఎవరి మాటలో విని నీచంగా ప్రవర్తించాడని, చేతులు కాళ్లు కట్టివేసి మోకాళ్లు, చేతులపై కొట్టాడని వాపోయాడు.
ఎస్పీకి ఫిర్యాదుతో కదలిక
పోలీసుల ప్రవర్తనతో ఆవేదనకు గురై దళిత సంఘాలతో కలిసి చిక్కమగళూరు ఎస్పీ అక్షయ్‌కి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎస్సై అర్జున్‌ను బదిలీచేశారు. డీఎస్పీ ప్రభు నేతృత్వంలో కేసు విచారణ చేపట్టాలని సూచించారు. ఎస్సై అర్జున్ పై వివిధ నేరాభియోగాలను నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment