‘స్కిల్‌’ కుంభకోణంలో కీలక వ్యక్తి అరెస్టు | Key person arrested in APSSDC Scam Andhra Pradesh | Sakshi
Sakshi News home page

‘స్కిల్‌’ కుంభకోణంలో కీలక వ్యక్తి అరెస్టు

Published Thu, Mar 9 2023 4:40 AM | Last Updated on Thu, Mar 9 2023 4:40 AM

Key person arrested in APSSDC Scam Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన రాష్ట్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) కుంభకోణంలో మరో కీలక వ్యక్తిని సీఐడీ అరెస్టు చేసింది. సీమెన్స్‌ ఇండస్ట్రియల్‌ సాఫ్ట్‌వేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మాజీ ఉద్యోగి జీవీఎస్‌ భాస్కర్‌ను ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఆయన నివాసంలో బుధవారం అదుపులోకి తీసుకుంది. అనంతరం ఆయన్ని కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్‌ వారెంట్‌పై విజయవాడకు తీసుకువస్తున్నారు. ఆయన్ని విజయవాడలోని కోర్టులో హాజరు­పరుస్తారు. జీవీఎస్‌ భాస్కర్‌తో సహా ఈ కేసులో ఇప్పటివరకు సీఐడీ 8 మందిని అరెస్టు చేసింది.  

ప్రాజెక్టు వ్యయాన్ని అడ్డగోలుగా పెంచేసి.. 
రూ. 371 కోట్ల ప్రజాధానాన్ని చంద్రబాబు ప్రభుత్వ పెద్దలు కొల్లగొట్టడంలో జీవీఎస్‌ భాస్కర్‌ ప్రధాన పాత్ర పోషించారని సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. టీడీపీ ప్రభుత్వం సీమెన్స్‌ కంపెనీ ముసుగులో షెల్‌ కంపెనీలతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం రూపకల్పనలో ఆయనే కీలకంగా వ్యవహరించారు. (అసలు ఆ ప్రాజెక్టు గురించి తమకేమీ తెలియదని, తమ కంపెనీ అసలు ఆ ఒప్పందం కుదుర్చుకోలేదని సీమెన్స్‌ కంపెనీ ప్రధాన కార్యాలయం తరువాత ప్రకటించడం గమనార్హం).

సీమెన్స్‌ ఇండియా లిమిటెడ్‌కు అప్పట్లో ఎండీగా ఉన్న సుమన్‌ బోస్‌తో కుమ్మక్కై టీడీపీ పెద్దలు ఈ ఎంవోయూ కథ నడిపారు. అందులో భాస్కర్‌ కీలకంగా వ్యవహరించారు. అంచనాలను పెంచేసి ప్రాజెక్టు వ్యయాన్ని రూ.3,300 కోట్లుగా చూపించారు. అందులో 10 శాతం వాటాగా రాష్ట్ర ప్రభుత్వం రూ.371 కోట్లు సమకూర్చాలని లెక్క తేల్చారు. సీమెన్స్‌ కంపెనీ కేవలం రూ.58 కోట్లు విలువైన సాఫ్ట్‌వేర్‌ను మాత్రమే సమకూర్చింది.

కేవలం అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే భాస్కర్‌ ప్రాజెక్టు వ్యయాన్ని పెంచేశారని సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. అంతేకాదు.. ఆ ప్రాజెక్టు వ్యయాన్ని మూడో పార్టీ ద్వారా పరిశీలించేందుకు సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్స్‌ డిజైన్‌ (సీఐటీడీ)కు నివేదించగా అక్కడ కూడా భాస్కరే కథ నడిపారు. ఇతర నిందితులతో కలిసి అనుకూలంగా నివేదిక వచ్చేలా మేనేజ్‌ చేశారు.

అంతేకాకుండా నిధులు కొల్లగొట్టడానికి అనుకూలంగా అవగాహన ఒప్పందం (ఎంవోయూ)ను తయారు చేశారు. ఒప్పందం రూ.3,300 కోట్లకు చేశారు. కానీ ప్రభుత్వం తన వాటాగా రూ.371 కోట్లు చెల్లించాలనే దగ్గరకు వచ్చేసరికి పక్కా కుతంత్రానికి పాల్పడ్డారు. ఈ ప్రాజెక్టులో టెక్నాలజీ పార్ట్‌నర్స్‌గా ఉన్న సీమెన్స్, డిజైన్‌ టెక్‌లకు కేవలం రూ.371 కోట్ల వర్క్‌ ఆర్డర్‌ ఇస్తున్నట్టుగా రాశారు. దాంతో వర్క్‌ ఆర్డర్‌ విలువ మేరకే సీమెన్స్, డిజైన్‌టెక్‌ కంపెనీలకు చెల్లించాలనే భావన కలిగించారు.

కానీ మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.3,300 కోట్లలో సీమెన్స్‌ కంపెనీ 90 శాతం ముందు సమకూర్చాలన్న ఒప్పందంలోని ప్రధాన అంశాన్ని.. ఆ తరువాత పేరాల్లో లేకుండా చేశారు. ఇలా కేవలం రూ.371 కోట్ల వర్క్‌ ఆర్డర్‌ మేరకే బిల్లులు చెల్లిస్తున్నట్టు భ్రాంతి కలిగించారు. ఇదంతా టీడీపీ ప్రభుత్వ పెద్దలతో కుమ్మక్కై చేశారని సీఐడీ దర్యాప్తులో ఆధారాలతో సహా నిరూపితమైంది.  

పరస్పర విరుద్ధ ప్రయోజనాలు 
ఎంవోయూ కుదిరిన తరువాత భాస్కర్‌ తన సతీమణి అపర్ణను ఏపీఎస్‌ఎస్‌డీసీలో డిప్యూటీ సీఈవోగా పోస్టింగు వచ్చేలా కథ నడిపించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఏపీఎస్‌ఎస్‌డీసీ అప్పటి ఎండీ, సీఈవో గంటా సుబ్బారావుతో భాస్కర్‌ కుమ్మక్కయ్యారు. దాంతో అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దలు ఉత్తరప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి అపర్ణను రాష్ట్రానికి డెప్యుటేషన్‌పై తీసుకువచ్చారు.

అనంతరం ఆమెకు ఏపీఎస్‌ఎస్‌డీసీలో డిప్యూటీ సీఈవోగా పోస్టింగు ఇచ్చారు. సీమెన్స్‌ కంపెనీలో భాస్కర్‌ కీలకంగా ఉండగా.. ఆయన భార్య ఏపీఎస్‌ఎస్‌డీసీలో డిప్యూటీ సీఈవోగా ఉండటం పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుంది. ఈ విషయాన్ని దాచిపెట్టి మరీ కుంభకోణానికి రంగం సిద్ధం చేశారు. 

షెల్‌ కంపెనీలతోనూ బంధం 
ఈ ప్రాజెక్టు పేరుతో నిధుల మళ్లింపునకు సాధనంగా ఉన్న షెల్‌ కంపెనీల్లోనూ జీవీఎస్‌ భాస్కర్‌ కీలకంగా వ్యవహరించారు. ఎస్‌ఐఎస్‌డబ్లూ కంపెనీకి చెందిన అప్టస్‌ హెల్త్‌కేర్‌ ఒక షెల్‌ కంపెనీగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. సీమెన్స్‌ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం డిజైన్‌ టెక్, స్కిల్లర్‌ కంపెనీలకు  చెల్లించిన రూ.371 కోట్లను ఈ షెల్‌ కంపెనీ ద్వారానే విదేశీ ఖాతాలకు మళ్లించారు. ఆ షెల్‌ కంపెనీతో భాస్కర్‌కు సన్నిహిత సంబంధాలున్నట్టుగా సీఐడీ గుర్తించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement