ఆమె అతన్ని నమ్మింది. అన్నా అని ఆప్యాయంగా పిలిచి.. ఇంటికి పిలిచి మరీ భోజనం పెట్టేది. కానీ, అతడిలోని ఉన్మాదం బయటపడింది. మరో ఇద్దరితో కలిసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అక్కడితో ఆగలేదు. ఆమెను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఆపై ఆమె ఇద్దరు బిడ్డలను(7, 6 ఏళ్ల వయసు) వదల్లేదు. ఘోరమైన ఈ కేసులో చివరకు ఆ మానవ మృగాలకు న్యాయస్థానం మరణశిక్ష ఖరారు చేసింది.
దేశ రాజధానిలో సంచలనం సృష్టించిన ఖ్యాలా ట్రిపుల్ మర్డర్(వివాహిత హత్యాచారం) కేసులో ముగురు నిందితులకు మరణశిక్ష పడింది. మంగళవారం తీస్ హజారీ కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. 2015లో మొహమ్మద్ అక్రమ్, షాహిద్, రఫత్ అలీ అనే ముగ్గురు.. తమకు పరిచయం ఉన్న వివాహితపై హత్యాచారానికి(గ్యాంగ్ రేప్, మర్డర్) పాల్పడడంతో పాటు ఆమె పిల్లలిద్దరిని అత్యంత దారుణంగా హతమార్చారు. ఆపై ఇంట్లోని డబ్బు, నగదుతో పరారయ్యారు. అదే ఏడాదిలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ.. కోర్టు విచారణ మాత్రం ఎనిమిదేళ్లపాటు సాగింది. సుదీర్ఘ దర్యాప్తు కొనసాగిన అనంతరం ఈ కేసులో పక్కా ఆధారాల్ని పోలీసులు కోర్టులో సమర్పించడంతో స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ న్యాయమూర్తి అంచల్ మంగళవారం శిక్ష ఖరారు చేశారు.
జడ్జి వ్యాఖ్యలు..
తీర్పు చదివే సమయంలో జడ్జి.. ‘‘ఆమె భర్త పని మీద ఊరు వెళ్తున్నాడని నిందితులకు తెలుసు. ఉద్దేశపూర్వకంగానే ఆమె ఇంట్లోకి చొరబడ్డారు. నిందితుల కుట్ర ఈ కేసులో స్పష్టంగా తెలుస్తోంది. ఆమె బిడ్డలను కూడా చంపి.. అత్యంత పైశాచికంగా ప్రవర్తించారు ఈ ముగ్గురు. అన్నింటికి మంచి ప్రధాన నిందితుడు అక్రమ్‌పై ఆమె పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశాడు. అన్నా అనే పిలుపునకు కళంకం తెచ్చాడు అంటూ మరణశిక్ష విధిస్తున్నట్లు తీర్పు ఇచ్చారు.
పక్కా స్కెచ్ వేసి..
2015లో ఢిల్లీ రఘువీర్ నగర్‌లోని బాధిత కుటుంబం ఉంటోంది. అదే కాలనీలో ఉండే మొహమ్మద్ అక్రమ్ ఆ కుటుంబంతో చనువుగా ఉంటూ వచ్చేవాడు. సదరు వివాహిత అతన్ని అన్నగా పిలుస్తూ.. ఇంటికి పిలిచి భోజనం పెట్టేది. ఈ క్రమంలో పని మీద జైపూర్ వెళ్లి తిరిగొచ్చిన భర్తకు.. ఇంట్లో భార్య, ఇద్దరు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండడం కనిపించింది. భార్య మెడకు దుపట్టా, కూతురి మెడకు కర్చీఫ్‌తో ఉరేసి ఉంది. ఇంట్లో దోపిడీ జరిగినట్లు స్పష్టంగా ఆనవాళ్లు కనిపించాయి. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించాడు. 2015, సెప్టెంబర్ 21వ తేదీన ఈ ఘటన జరిగింది.
పోస్ట్‌మార్టం నివేదికలో ఆమె అత్యాచారానికి గురైనట్లు తేలడంతో పాటు పదునైన ఆయుధంతో ఆమెను హతమార్చినట్లు తేలింది. ఈ కేసులో దర్యాప్తులోతుకి వెళ్లిన పోలీసులకు అక్రమ్‌పైనే అనుమానాలు మళ్లాయి. అదే ఏడాది అక్టోబర్‌లో షాహిద్, అక్రమ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లిచ్చిన సమాచారంతో.. రఫత్(అప్పుడు మైనర్‌గా ఉన్నాడు)అనే మరో నిందితుడ్ని అరెస్ట్ చేసి జువైనల్ హోంకు తరలించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం, నిందితుల ఫోన్‌కాల్స్ రికార్డయిన సమయం.. ప్రాంతం.. ఇలా అన్నింటిని పోలీసులు పరిశీలించారు. సుదీర్ఘ దర్యాప్తు తర్వాత.. 2023, ఆగష్టు 22న ఈ ముగ్గురిని దోషులుగా నిర్ధారించింది న్యాయస్థానం.
Comments
Please login to add a commentAdd a comment