భూవివాదం ఇద్దరి ప్రాణం మీదకు తెచ్చింది. గతంలో కుదుర్చుకున్న ఒప్పందానికి భిన్నంగా ఇప్పుడు ఎక్కువ ధర రావడంతో విక్రయదారురాలు వేరొకరికి అమ్మకానికి చూపడంతో వివాదం మొదలైంది. చివరకు కత్తితో పొడిచి ప్రాణాపాయానికి తెచ్చేంత పరిస్థితి నెలకొంది. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే..
భోగాపురం: పూసపాటిరేగ మండలం కోనాడకు చెందిన అరుణ, విజయనగరం కాణిపాక గ్రామానికి చెందిన పతివాడ ప్రవీణ్‌కుమార్‌పై కోనాడకు చెందిన బసవ ఉపేంద్ర కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకోవడంతో సంచలనం రేగింది. దీనికి సంబంధించి భోగాపురం సీఐ శ్రీధర్ తెలిపిన వివరాలు.. కోనాడ గ్రామానికి చెందిన రామగురువులు అనే మహిళ తనకున్న 1.90 ఎకరాల భూమిని వారి బంధువులైన బసవ అచ్చిబాబుకు గతంలో విక్రయించేందుకు సిద్ధపడి వారి నుంచి కొంత మొత్తం నగదు తీసుకుంది. ఇటీవల కాలంలో ఆ భూముల ధరలకు రెక్కలు రావడంతో డబ్బులకు ఆశపడి రామగురువులు అదే భూమిని అచ్చిబాబుకు తెలియకుండా విజయవాడలో ఉంటున్న శ్రీనివాసరెడ్డికి అమ్మేందుకు తన కూతురు అరుణతో కలిసి రామగురువులు శుక్రవారం భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చింది.
దీంతో విషయం తెలుసుకున్న అచ్చిబాబు తన కుమారులు ఉపేంద్ర, వెంకటేష్, కె.అప్పలరెడ్డితో కలిసి భోగాపురం రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చాడు. రామగురువులును ప్రశ్నించాడు. గతంలో ఈ భూమిని తనకు విక్రయించేందుకు అడ్వాన్స్ తీసుకొని ఇప్పుడు తనకు తెలియకుండా వేరొకరికి ఎలా విక్రయిస్తావని ఇది ఎంత వరకు సమంజసమని అచ్చిబాబు రామగురువులును నిలదీశాడు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. అది కాస్త ఘర్షణకు దారితీసింది. దీంతో అచ్చిబాబుతో వచ్చిన కుమారుల్లో ఒకరైన బసవ ఉపేంద్ర కొపోద్రిక్తుడై తమ్ముడు వెంకటేష్, స్నేహితుడు అప్పలరెడ్డితో కలిసి రామగురువులు కుమార్తె అరుణపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఇంతలో కొనుగోలుదారులు తరఫున వచ్చిన కాణిపాకకు చెందిన ప్రవీణ్‌కుమార్ ఈ సంఘటనను తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించడంతో గమనించి ఉపేంద్ర ఆయనపై కూడా కత్తితో దాడికి పాల్పడ్డాడు.
దీంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటన స్థలానికి ఎస్‌ఐ మహేష్ తన సిబ్బందితో చేరుకున్నాడు. అప్పటికే రక్తం మడుగులో ఉన్న అరుణ, ప్రవీణ్‌కుమార్‌ను వెంటనే విజయనగరంలోని తిరుమల ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఉపేంద్రపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ శ్రీధర్ తెలిపారు. ఇదిలా ఉండగా ఈ సంఘటన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద జనం మధ్య జరగడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందోనన్న భయాందోళనకు గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment