నెల్లూరు జిల్లా సంగం సమీపంలోని బీరాపేరు వాగులో పడిన ఆటో
సంగం: కుటుంబ సభ్యుడి కర్మకాండ ముగించుకుని దైవ సన్నిధిలో నిద్ర చేయడానికి వెళుతున్న ఓ పెద్ద కుటుంబం ఊహించని రీతిలో ప్రమాదానికి గురైంది. మరో కుటుంబ సభ్యురాలిని పోగొట్టుకొని, ఇంకో ఐదుగురి జాడ తెలియక.. ప్రమాదం నుంచి బయట పడిన ఆరుగురు తల్లడిల్లిపోతున్నారు. ‘దేవుడా.. ఏమిటీ ఘోరం’ అని గుండెలవిసేలా రోదిస్తున్నారు. గురువారం రాత్రి వీరు ప్రయాణిస్తున్న ఆటో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా సంగం సమీపంలోని బీరాపేరు వాగులో పడిపోవడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. ఆత్మకూరు పట్టణంలోని 22వ వార్డు జ్యోతినగర్‌కు చెందిన కర్రా నాగేంద్ర ఇటీవల మృతి చెందాడు. గురువారం కర్మకాండలు ముగియడంతో సంప్రదాయం ప్రకారం పుణ్యక్షేత్రంలో నిద్ర చేయడం కోసం ఆటోలో 12 మంది కుటుంబ సభ్యులు ఆత్మకూరు నుంచి సంగం సంగమేశ్వరాలయానికి బయలుదేరారు.
ఈ క్రమంలో బీరాపేరు వాగు వద్ద ఆటోను రోడ్డుపై నిలిపారు. ఇదే సమయంలో నెల్లూరు వైపు నుంచి ఆత్మకూరు వైపు వెళ్తున్న ఓ లారీ ఆటోను ఢీకొంది. దీంతో పక్కనే ఉన్న బీరాపేరు వాగులోకి ఆటో పడిపోయింది. అందులో ఉన్న వారు కేకలు వేయడంతో స్థానికులు వెంటనే స్పందించి వాగులోకి దిగారు. ఆ సమయంలో నీటి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పటికీ ఆరుగురిని కాపాడారు. నాగవల్లి (14) అనే బాలికను వాగులోంచి బయటకు తెచ్చినప్పటికీ, పరిస్థితి విషమంగా ఉండడంతో 108 వాహనంలో ఆత్మకూరు వైద్యశాలకు తరలించిన అనంతరం మృతి చెందింది.
గల్లంతైన మరో ఐదుగురి కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు, జాలర్లు గాలిస్తున్నారు. ఆత్మకూరు డీఎస్పీ కె వెంకటేశ్వరరావు, సంగం ఎస్సై నాగార్జునరెడ్డి ఘటన స్థలానికి చేరుకుని ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాల ద్వారా ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఘటనపై పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వెంటనే స్పందించారు. ఆత్మకూరు ఆర్డీఓ ఏ చైత్రవర్షిణి, పోలీసు అధికారులను అప్రమత్తం చేసి యుద్ధ ప్రాతిపదికన రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment