auto and lorry
-
Telangana: మే 19న ఆటో, లారీ, క్యాబ్‌లు బంద్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా తెలంగాణ ఆటో, క్యాబ్, లారీ సంఘాల జేఏసీ ఈ నెల 19న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్‌కు సంబంధించి గోడపత్రికను హైదరాబాద్, హైదర్‌గూడలో జేఏసీ నాయకులు ఆవిష్కరించారు. ఇవాళ అన్ని జిల్లా కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేయనున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. 19న బంద్‌రోజు రవాణా శాఖ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు తెలిపారు. కరోనా కష్ట కాలంలో కార్మికులను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం జీవో 714 తీసుకొచ్చి ఫిట్నెస్ రెన్యూవల్ రోజుకు 50 పెనాల్టీ వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఈ ప్రతిపాదనను కేంద్రప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. చదవండి: (మోదీని కించపరిస్తే తాటతీసి తరిమికొడతాం) -
ఆగిన ఆటోను ఢీకొన్న లారీ
సంగం: కుటుంబ సభ్యుడి కర్మకాండ ముగించుకుని దైవ సన్నిధిలో నిద్ర చేయడానికి వెళుతున్న ఓ పెద్ద కుటుంబం ఊహించని రీతిలో ప్రమాదానికి గురైంది. మరో కుటుంబ సభ్యురాలిని పోగొట్టుకొని, ఇంకో ఐదుగురి జాడ తెలియక.. ప్రమాదం నుంచి బయట పడిన ఆరుగురు తల్లడిల్లిపోతున్నారు. ‘దేవుడా.. ఏమిటీ ఘోరం’ అని గుండెలవిసేలా రోదిస్తున్నారు. గురువారం రాత్రి వీరు ప్రయాణిస్తున్న ఆటో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లా సంగం సమీపంలోని బీరాపేరు వాగులో పడిపోవడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. ఆత్మకూరు పట్టణంలోని 22వ వార్డు జ్యోతినగర్‌కు చెందిన కర్రా నాగేంద్ర ఇటీవల మృతి చెందాడు. గురువారం కర్మకాండలు ముగియడంతో సంప్రదాయం ప్రకారం పుణ్యక్షేత్రంలో నిద్ర చేయడం కోసం ఆటోలో 12 మంది కుటుంబ సభ్యులు ఆత్మకూరు నుంచి సంగం సంగమేశ్వరాలయానికి బయలుదేరారు. ఈ క్రమంలో బీరాపేరు వాగు వద్ద ఆటోను రోడ్డుపై నిలిపారు. ఇదే సమయంలో నెల్లూరు వైపు నుంచి ఆత్మకూరు వైపు వెళ్తున్న ఓ లారీ ఆటోను ఢీకొంది. దీంతో పక్కనే ఉన్న బీరాపేరు వాగులోకి ఆటో పడిపోయింది. అందులో ఉన్న వారు కేకలు వేయడంతో స్థానికులు వెంటనే స్పందించి వాగులోకి దిగారు. ఆ సమయంలో నీటి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పటికీ ఆరుగురిని కాపాడారు. నాగవల్లి (14) అనే బాలికను వాగులోంచి బయటకు తెచ్చినప్పటికీ, పరిస్థితి విషమంగా ఉండడంతో 108 వాహనంలో ఆత్మకూరు వైద్యశాలకు తరలించిన అనంతరం మృతి చెందింది. గల్లంతైన మరో ఐదుగురి కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు, జాలర్లు గాలిస్తున్నారు. ఆత్మకూరు డీఎస్పీ కె వెంకటేశ్వరరావు, సంగం ఎస్సై నాగార్జునరెడ్డి ఘటన స్థలానికి చేరుకుని ఎన్డీఆర్ఎఫ్ బృందాల ద్వారా ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఘటనపై పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వెంటనే స్పందించారు. ఆత్మకూరు ఆర్డీఓ ఏ చైత్రవర్షిణి, పోలీసు అధికారులను అప్రమత్తం చేసి యుద్ధ ప్రాతిపదికన రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. -
కూలీలను కబళించిన మృత్యువు
పామిడి (అనంతపురం): సద్ది కట్టుకుని ఆటోలో బయల్దేరిన పత్తి కూలీలను లారీ రూపంలో మృత్యువు కబళించింది. అనంతపురం జిల్లా పామిడి పట్టణంలోని జాతీయ రహదారిపైకి వెళ్లే మలుపు వద్ద ఆటోను లారీ ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు కూలీలు మృత్యువాత పడ్డారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. గార్లదిన్నె మండలం కొప్పలకొండకు చెందిన దాదాపు వంద కుటుంబాలు వ్యవసాయ పనులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. వీరంతా సమీపంలోని పామిడి, పెద్దవడుగూరు మండలాల్లో పత్తి తొలగింపు పనులకు వెళ్తుంటారు. శుక్రవారం వేకువజామున పెద్దవడుగూరు మండలం కొట్టాలపల్లి పొలాల్లో పత్తి తీసేందుకు కొప్పలకొండ నుంచి 14 మంది కూలీలు తమ గ్రామానికే చెందిన డ్రైవర్ నల్లబోతుల లక్ష్మీనారాయణ ఆటోలో బయలుదేరారు. ఆటో పామిడి పట్టణం మీదుగా జాతీయ రహదారిపైకి చేరుకుంటుండగా.. హైదరాబాద్ వైపు నుంచి లారీ ఎదురుగా దూసుకొచ్చి ఆటోను ఢీకొట్టింది. ప్రమాదంలో కూలీలు గూడు చౌడమ్మ (32), గోసుల సుబ్బమ్మ (47), గోసుల సావిత్రి (37), మీనుగ నాగవేణి (47), గోసుల శంకరమ్మ (43) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కూలీలు రామలక్ష్మి, సుబ్బరాయుడు, లక్ష్మీదేవి, ఆదిలక్ష్మి, రమాదేవి, నాగవేణి, రేవంత్, జయమ్మతోపాటు ఆటో డ్రైవర్ లక్ష్మీనారాయణ గాయాల పాలయ్యారు. స్పందించిన స్థానికులు క్షతగాత్రులను వెంటనే అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో నల్లబోతుల నాగవేణి (23) మృతి చెందింది. ఆటో డ్రైవర్ లక్ష్మీనారాయణ భార్య జయమ్మ (40) పరిస్థితి విషమంగా ఉంది. పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సీఈవో ఆలూరి సాంబశివారెడ్డి, ఆర్డీవో మధుసూదన్‌లు ఘటనా స్థలంలో సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. -
అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం ; ఆరు మంది మృతి
-
ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృతి
సాక్షి, పెద్దాపురం(తూర్పు గోదావరి జిల్లా) : సామర్లకోట కాకినాడ ఏడీబీ రోడ్డులో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో, టిప్పర్ ఢీ కొన్న దుర్ఘటనలో ఆరుగురు మృతిచెందగా, మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కాకినాడ జీజీహెచ్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు పెదపూడి మండలం రామేశ్వరానికి చెందిన వారుగా గుర్తించారు. మృతుల్లో మూడేళ్ల చిన్నారితో పాటూ నలుగురు మహిళలున్నారు. ఓ శుభకార్యం నిమిత్తం వడ్లమూరు గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం అనంతరం టిప్పర్‌తో సహా లారీ డైవర్ పరారయ్యాడు. -
ఆటో లారీ ఢీ : ముగ్గురికి గాయాలు
ఆలమూరు : పదహారో నంబరు జాతీయ రహదారిలోని చెముడులంక వద్ద శుక్రవారం ఓ లారీ మోటారు సైక్లిస్టును, ఆటోను ఢీకొనడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాజానగరం నుంచి కేరళ రాష్ట్రానికి బియ్యం లోడుతో వెళుతున్న లారీ స్థానిక బస్టాండు సమీపంలో ఓ ద్విచక్రవాహనాన్ని అనంతరం ఆటోను ఢీకొంది. ఆటో రోడ్డుమీద బోల్తా కొట్టి నుజ్జునుజ్జయింది. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న రాజమహేంద్రవరానికి చెందిన టీవీ మెకానిక్ సురేష్ ఫణికుమార్, ఆటోలో ప్రయాణిస్తున్న కడియం మండలం బుర్రిలంకకు చెందిన అడపా బాబీ, తోరాటి సురేష్ తీవ్రంగా గాయపడ్డారు. బాబీ, సురేష్ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఓ కల్యాణమండపాన్ని పూలతో అలంకరించేందుకు వెళుతున్నారు. గాయపడిన ఆ ముగ్గురినీ ఎన్‌హెచ్ 16 అంబులెన్స్‌లో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వాహనాలను ఢీకొట్టి పారిపోతున్న లారీ డ్రైవర్, క్లీనర్‌ను వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాసు తదితర స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. లారీ, కారు ఢీకొని ఒకరికి గాయలు కొత్తపేట : స్థానిక దేవీ సెంటర్లో చిన్న కారును లారీ ఢీకొనడంతో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ కారుమూరి రామలింగేశ్వరరావు శుక్రవారం ఉదయం అమలాపురంలో బంధువుల గృహప్రవేశానికి వెళ్లాడు. సాయంత్రం ఇండికా కారును తానే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ ద్వారపూడి వెళుతుండగా కొత్తపేట దేవీ సెంటర్లో ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. దాంతో రామలింగేశ్వరరావు తలకు, ఛాతీకి, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆయనను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయనను పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుని బావమరిది బొడ్డు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరపుతున్నట్టు ఎస్సై డి. విజయకుమార్ తెలిపారు.