ఆటో లారీ ఢీ : ముగ్గురికి గాయాలు
ఆటో లారీ ఢీ : ముగ్గురికి గాయాలు
Published Fri, Aug 19 2016 9:43 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
ఆలమూరు :
పదహారో నంబరు జాతీయ రహదారిలోని చెముడులంక వద్ద శుక్రవారం ఓ లారీ మోటారు సైక్లిస్టును, ఆటోను ఢీకొనడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాజానగరం నుంచి కేరళ రాష్ట్రానికి బియ్యం లోడుతో వెళుతున్న లారీ స్థానిక బస్టాండు సమీపంలో ఓ ద్విచక్రవాహనాన్ని అనంతరం ఆటోను ఢీకొంది. ఆటో రోడ్డుమీద బోల్తా కొట్టి నుజ్జునుజ్జయింది. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న రాజమహేంద్రవరానికి చెందిన టీవీ మెకానిక్ సురేష్ ఫణికుమార్, ఆటోలో ప్రయాణిస్తున్న కడియం మండలం బుర్రిలంకకు చెందిన అడపా బాబీ, తోరాటి సురేష్ తీవ్రంగా గాయపడ్డారు. బాబీ, సురేష్ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఓ కల్యాణమండపాన్ని పూలతో అలంకరించేందుకు వెళుతున్నారు. గాయపడిన ఆ ముగ్గురినీ ఎన్‌హెచ్ 16 అంబులెన్స్‌లో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వాహనాలను ఢీకొట్టి పారిపోతున్న లారీ డ్రైవర్, క్లీనర్‌ను వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాసు తదితర స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
లారీ, కారు ఢీకొని ఒకరికి గాయలు
కొత్తపేట : స్థానిక దేవీ సెంటర్‌లో చిన్న కారును లారీ ఢీకొనడంతో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ కారుమూరి రామలింగేశ్వరరావు శుక్రవారం ఉదయం అమలాపురంలో బంధువుల గృహప్రవేశానికి వెళ్లాడు. సాయంత్రం ఇండికా కారును తానే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ ద్వారపూడి వెళుతుండగా కొత్తపేట దేవీ సెంటర్‌లో ఎదురుగా వచ్చిన లారీ ఢీకొంది. దాంతో రామలింగేశ్వరరావు తలకు, ఛాతీకి, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆయనను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయనను పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుని బావమరిది బొడ్డు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరపుతున్నట్టు ఎస్సై డి. విజయకుమార్ తెలిపారు.
Advertisement