
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, వైఎస్సార్ : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వ్యహారం విషయంలో కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు తల్లిదండ్రులు. ఈ సంఘటన రాయచోటిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాయచోటికి చెందిన ఓ యువతి అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. ఈ ప్రేమ వ్యవహారం ఇష్టం లేని కుటుంబసభ్యులు ఆమెకు మరో సంబంధం చూసి పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వచ్చిన సంబంధాలన్నీ ఆమె చెడగొడుతోంది. దీంతో కొద్దిరోజులుగా కుటుంబసభ్యులతో ఆమెకు గొడవ జరుగుతోంది.
ఈ క్రమంలోనే మంగళవారం మరోసారి కుటుంబ సభ్యులు పెళ్లి విషయంపై బలవంతం చేయగా ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు, సోదరుడు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. యువతి కేకలు వేయడంతో ఆమె అక్క, స్థానికులు వచ్చి మంటలు ఆర్పివేశారు. తీవ్రంగా గాయపడిన ఆమెను కడప రిమ్స్ కు తరలించారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment