ప్రతీకాత్మక చిత్రం
బెళుగుప్ప(అనంతపురం జిల్లా): దశాబ్దాలు వేగంగా మారుతున్నాయి.. సాంకేతిక వ్యవస్థ సరికొత్త పుంతలు తొక్కుతోంది. మనిషికి చావే లేకుండా చేసేందుకు ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. అయితే కుల జాడ్యం మాత్రం మనుషుల మధ్య చిచ్చుపెడుతూనే ఉంది. తాజాగా కుల పట్టింపులకు ఓ ప్రేమ జంట బలైంది. తల్లిదండ్రులు వివాహానికి ఒప్పుకోకపోవడంతో నిండు నూరేళ్లు కలసి బతకాల్సిన ఆ యువతీ యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు.
చదవండి: మిస్ సౌత్ ఇండియాగా వైజాగ్ అమ్మాయి
రాయదుర్గం పట్టణం ఎస్సీ కాలనీకి చెందిన శ్రీకన్య (20) స్థానిక నర్సరీలో పనిచేసేది. రాయదుర్గం మండలం కెంచానపల్లికి చెందిన బోయ ధనుంజయ (23) పట్టణంలోని ఓ సెల్‌ఫోన్ రిపేరీ షాపులో పనిచేసేవాడు. ఏడాదిన్నర క్రితం వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారి తీసింది. తమ ప్రేమ వ్యవహారాన్ని కుటుంబీకులకు తెలిపారు. అయితే కులాలు వేరు కావడంతో ఇరువైపుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తాయి. దీంతో మనస్తాపం చెందిన శ్రీకన్య, ధనుంజయ కలిసి బతకలేమని భావించారు. చావులోనైనా ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు.
బుధవారం రాత్రి వీరిద్దరూ బెళుగుప్ప మండలం నరసాపురం సమీపంలోని ఓ తోట వద్దకు చేరుకున్నారు. వెంట తెచ్చుకున్న విషద్రావకం తాగారు. ఆ తర్వాత తమ స్నేహితులకు ఫోన్ చేసి తాము చనిపోతున్నామని తెలిపారు. దీంతో వారు బెళుగుప్ప పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే వారున్న ప్రాంతానికి చేరుకున్నారు.
ఆ వెంటనే 108 వాహనం రావటంతో అందులో వారిని కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీకన్య గురువారం తెల్లవారుజామున, రాత్రి ధనుంజయ మృతి చెందారు. ఈ ఘటనపై యువతి తండ్రి తిప్పేస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బెళుగుప్ప ఎస్‌ఐ రుషేంద్రబాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment