
ప్రతీకాత్మకచిత్రం
బాపట్ల: పట్టణంలో ప్రేమజంట ఆత్మహత్య చేసుకుందన్న వార్త కలకలం రేపుతోంది. బలవన్మరణానికి కారణాలు తెలియరావడం లేదు. ఘటనను పోలీసులూ నిర్ధారించడం లేదు. దీనిపై సోషల్‌మీడియాలో రకరకాల కథనాలు హల్‌చల్ చేస్తున్నాయి. సేకరించిన సమాచారం మేరకు కర్లపాలెం మండలం చింతాయలపాలెంకు చెందిన యువకుడు, బాపట్లకు చెందిన యువతి ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ సోమవారం అర్ధరాత్రి దాటాక మూర్తిరక్షణ నగర్ రైల్వేగేట్ వద్దకు వెళ్లి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.
మృతదేహాలను బంధువులు వెంటనే తీసుకెళ్లిపోయారని తెలుస్తోంది. యువతి మృతదేహాన్ని రాత్రికిరాత్రే ఖననం చేసేసినట్టు తెలుస్తోంది. తెల్లవారుజామున విషయం సోషల్ మీడియాలో రావడంతో కర్లపాలెం పోలీసులు చింతాయపాలెంలోని యువకుడి ఇంటికి వెళ్లారు. ఫిర్యాదు చేసేందుకు అతడి తల్లిదండ్రులు ముందుకు రాలేదు. మంగళవారం మధ్యా హ్నం అతడి మృతదేహాన్నీ ఖననం చేసినట్టు సమాచారం. దీనిపై బాపట్ల రైల్వే పోలీసులను వివరణ కోరగా ఏమీ తెలియదని చెప్పారు. వాస్తవానికి రైల్వేట్రాక్‌పై ఆత్మహత్య జరిగితే వారే కేసు విచారణ చేయాలి.