ప్రతీకాత్మక చిత్రం
ముంబై: ముంబై నగరానికి చెందిన ఓ 57 ఏళ్లు వ్యక్తికి కొన్ని రోజుల క్రితం ఒక గుర్తుతెలియని నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. తన పేరు జ్యోతి అని పరిచయం చేసుకున్న ఓ మహిళ ఆ వ్యక్తితో మాటలు కలిపింది. తనకు ఎవరూ లేరు, ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాని ఆమె చెప్పింది. మెల్లిమెల్లిగా సన్నిహితంగా మాట్లాడటం ప్రారంభించింది. ఈ క్రమంలో ఆ వ్యక్తిని తన మాటలతో రెచ్చగొట్టింది. ఆమె మాటలకు లొంగిపోయిన సదరు వ్యక్తి మార్చి 23న ఆ మహిళకు ఫోన్ చేసి కలుస్తానని చెప్పాడు.
దీంతో ఆ మహిళ తన ఫ్లాట్‌కు రావాల్సిందిగా చెప్పి తూర్పు భయాందర్‌లోని షిరిడీనగర్‌లో ఉన్న ఒక అపార్టుమెంట్ అడ్రస్ ఇచ్చింది. ఇక, ఈ వ్యక్తి ఎంతో ఉత్సాహంతో ఆమె చెప్పిన చోటుకి వెళ్లి ఇంటి తలుపు తట్టాడు. ఇతణ్ని లోపలికి ఆహ్వానించిన సదరు మహిళ నేరుగా బెడ్ రూంలోకి తీసుకెళ్లింది. ఇంతలోనే అతనికి షాకిస్తూ ఓ ముగ్గురు వ్యక్తులు పోలీసు యూనిఫాంలో సరాసరి వాళ్లు ఉన్న బెడ్ రూంలోకి చొచ్చుకు వచ్చి ఏం చేస్తున్నారంటూ బెదిరించారు.
అరెస్ట్ చేస్తామని చెప్పి ఆ వ్యక్తిని భయపెట్టారు. దీంతో తనకేం తెలియదని వదిలేయమని ఆ పెద్దమనిషి ప్రాధేయపడగా రూ. 2 లక్షలు ఇస్తే వదిలేస్తామని చెప్పారు. ఈ రకంగా అతడి ఖాతాలో ఉన్న రూ. 70 వేలను దుండగులు లాగేసుకున్నారు. మిగతా డబ్బును రెండు రోజుల్లోగా ఇవ్వాలి, లేకపోతే ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తామని బెదిరించి అక్కడ్నించి పంపించారు. అయితే వారి వ్యవహార శైలిపై అనుమానపడిన బాధితుడు, నేరుగా వెళ్లి జరిగిన విషయాన్ని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకునేందుకు స్కెచ్ వేశారు.
మిగతా డబ్బును ఇస్తామని బాధితుడి ద్వారా ఫోన్ చేయించి ఒక చోటుకి పిలిపించారు. వారు రాగానే అరెస్ట్ చేశారు. ఇక వారు అసలు పోలీసులే కాదని తేలింది.వీరు ఒక ముఠాగా ఏర్పడి ఈ తరహాలో హాని ట్రాప్ చేసి అమాయకుల నుంచి డబ్బులు గుంజడం చేస్తున్నారని పోలీసుల విచారణలో నిర్ధారణ అయింది. నిందితులను సుదర్శన్ 32, విజయ్ 56, ఆయుబ్ ఖాన్ 45లుగా పోలీసులు గుర్తించారు. అయితే మహిళ పేరును మాత్రం పోలీసులు చెప్పలేదు. వీరిని అరెస్ట్ చేశారు.
చదవండి: నోట్ రాసి మహిళా డాక్టర్ సూసైడ్.. రంగంలోకి దిగిన సీఎం
Comments
Please login to add a commentAdd a comment