సాక్షి, హైదరాబాద్: ఓ వ్యక్తి తన భార్య, కుమార్తెలతో కలిసి చోరీలు చేయడం మొదలెట్టాడు. ఈ త్రయం పాతబస్తీలోని వివిధ ప్రాంతాల్లో తలుపులు తెరిచి ఉన్న ఇళ్లను టార్గెట్‌గా చేసుకుంది. గతంలో నాలుగు కేసుల్లో జైలుకు వెళ్లింది. తాజాగా కామాటిపురా పోలీసుస్టేషన్ పరిధిలో మరో నాలుగు నేరాలు చేసి పోలీసులకు చిక్కిందని దక్షిణ మండల డీసీపీ గజరావ్ భూపాల్ మంగళవారం తెలిపారు. మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్ పరిధిలోని వట్టేపల్లికి చెందిన మహ్మద్ అబ్దుల్ సలీం వృత్తిరీత్యా పాత వస్త్రాల వ్యాపారి. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తన భార్య జకియా బేగం, కుమార్తె ఆయేషా సిద్ధిఖ్‌లతో కలిసి రంగంలోకి దిగాడు.
చదవండి: మధ్యప్రదేశ్‌లో దారుణం.. పెళ్లైన కూతురిపై తండ్రి అత్యాచారం
ముగ్గురూ పగటిపూటే కాలనీల్లో సంచరిస్తూ తలుపులు తెరిచి ఉండి, యజమానుల అలికిడి లేని ఇళ్లను గుర్తిస్తుంది. ఆ ఇంటి వద్ద భార్య, కుమార్తెలను దింపే సలీం కాస్త దూరంగా వెళ్లి ఎదురు చూస్తుంటాడు. ఆయేషా ఇంటి బయటే ఉండి పరిసరాలను గమనిస్తుండగా...జకియా ఇంట్లోకి వెళ్లి విలువైన వస్తువులు, బంగారం తదితరాలు తస్కరిస్తుంది. ఆపై వీరిద్దరూ సలీం వద్దకు వెళ్లి అతడితో కలిసి ఉడాయిస్తారు. చోరీ కోసం ఇంట్లోకి ప్రవేశించినప్పుడో, ఎదురుగా తచ్చాడుతున్నప్పుడో యజమానులు గుర్తిస్తే...అద్దె ఇంటి కోసం అన్వేషిస్తున్నామంటూ తల్లీకూతురు చెప్పి తప్పించుకుంటారు.
చదవండి: ఘోరం: కడియాల కోసం మహిళ కాళ్లను నరికి.. ఆపై..
ఈ పంథాలో వీళ్లు గతంలో సంతోష్‌నగర్, భవానీనగర్, మాదన్నపేటల్లో నాలుగు చోరీలు చేశారు. ఈ కేసుల్లో అరెస్టు కావడంతో బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇటీవల కామాటిపుర పరిధిలోని చందులాల్ బారాదారి, గుల్షన్ నగర్, ఘాజీబండల్లో నాలుగు ఇళ్లల్లో పంజా విసిరారు. ఈ మేరకు కేసులు నమోదు చేసుకున్న కామాటిపుర పోలీసులు మంగళవారం ముగ్గురినీ అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.6.5 లక్షల విలువైన బంగారం తదితరాలు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment