నిందితుడు అనిల్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: క్రిప్టోకరెన్సీగా పిలిచే బిట్ కాయిన్స్ దందాను వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిలో చేయవచ్చంటూ నగరానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లయిన భార్యాభర్తల నుంచి రూ.60 లక్షలు కాజేసిన కేసులో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఓ నిందితుడిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న సూత్రధారుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అమీర్‌పేటకు చెందిన వంశీమోహన్ దంపతులు ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉన్నత స్థానంలో పనిచేస్తున్నారు. కరోనా కారణంగా వర్క్‌ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. బిట్‌కాయిన్స్‌లో పెట్టుబడి పెట్టి ఇంట్లో కూర్చొనే భారీగా లాభాలు గడించవచ్చనే ప్రకటనకు వీళ్లు ఆకర్షితులయ్యారు.
రూ.50 లక్షల ఇన్వెస్ట్‌తో..
‘జిప్‌బిట్’ యాప్ ద్వారా కాయిన్ల క్రయవిక్రయాలు చేపట్టారు. దీని ద్వారానే వీరికి పరిచయమైన ఓ వ్యక్తి ఆ దందాలో లాభాలు కురిపిస్తానంటూ ఎర వేశాడు. తొలుత రూ.10 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. ప్రపంచ మార్కెట్‌లో బిట్ కాయిన్ విలువ పెరుగుతున్నా.. వీరి కాయిన్స్ వివరాలు తెలియట్లేదు. దీంతో ఆ వ్యక్తిని మరోసారి సంప్రదించారు. మీ కాయిన్లు భద్రమని, ప్రస్తుత పరిస్థితుల్లో రూ.50 లక్షలకు పైగా వెచ్చించి కాయిన్స్ ఖరీదు చేస్తేనే అధిక లాభాలని నమ్మబలికాడు. దీంతో ఆ మొత్తం అతడు చెప్పినట్లే బ్యాంకు ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్ చేశారు. ఇందులో కొంత జిప్‌బిట్ యాప్ ద్వారా, మిగిలింది ముంబై, పూణే నగరాలకు చెందిన పలు బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేశారు.
ఆన్‌లైన్‌లో చూసుకోండి..
లాభాలు రాకపోవడంతో సదరు వ్యక్తితో చాటింగ్ చేశారు. లాభం ఖచ్చితంగా ఉందని, ఆన్‌లైన్‌లో కాయిన్ ధర చూసుకోవాలని సూచించాడు. ఆ తర్వాత అతడి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయామని గ్రహించి ఈ నెల రెండో వారంలో సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్ డి.ప్రశాంత్ దర్యాప్తు చేపట్టారు. ఈమె పంపిన డబ్బులో రూ.30 లక్షలు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో ఉన్న ఇస్కాన్ సిటీవాసి తమ్ము అనిల్‌కుమార్‌కు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు.
10 నుంచి 20 శాతం కమీషన్
వృత్తిరీత్యా ఏసీ టెక్నీషియన్ అయిన అనిల్‌కు ఇంటర్నెట్‌లో ద్వారానే జిప్‌బిట్ యాప్ కోసం పనిచేస్తున్న వ్యక్తితో పరిచయమైంది. అతడితో వాట్సాప్ ద్వారా చాటింగ్ చేశారు. తాము సూచించిన లావాదేవీలకు సహకరిస్తూ వెళ్లడమే పనని, అలా చేస్తే 10 నుంచి 20 శాతం కమీషన్ ఇస్తామంటూ ఆ వ్యక్తులు ఇతడిని రంగంలోకి దింపారు. మిగిలిన మొత్తాన్ని బినాన్స్ యాప్ ద్వారా బిట్ కాయిన్స్ రూపంలో మార్చి తమకు పంపాలని వాళ్లు స్పష్టం చేశారు. దీనికి అంగీకరించిన అతడు వంశీమోహన్ దంపతులకు చెందిన రూ.30 లక్షలు, రాచకొండ పరిధికి చెందిన మరో మహిళ నుంచి రూ.6.5 లక్షలు తన ఖాతాల్లో వేయించుకున్నాడు. ఈ మొత్తంలో తన కమీషన్ మినహాయించుకుని మిగిలింది బిట్ కాయిన్స్‌గా మార్చేశాడు. వాటిని సూత్రధారులకు అందించాడు. రాచకొండ పోలీసులు అనిల్ వ్యవహారాన్ని గుర్తించి తమ కేసులో ఇటీవల అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న సిటీ సైబర్ క్రైమ్ అధికారులు పీటీ వారెంట్‌పై శుక్రవారం అరెస్టు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం తమ కస్టడీకి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment