
స్నేహలత (ఫైల్)
ధర్మవరం రూరల్/అనంతపురం క్రైం: ఓ యువతిని హత్య చేసి.. ఆ తర్వాత తగలబెట్టేందుకు ప్రయత్నించిన ఘటన అనంతపురం జిల్లా బడన్నపల్లి గ్రామ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. అనంతపురం పట్టణంలోని అశోక్ నగర్‌లో నివాసముంటున్న లష్మి, కుల్లాయప్ప దంపతుల కుమార్తె స్నేహలత(19) ధర్మవరంలోని ఎస్‌బీఐలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగినిగా పనిచేస్తోంది. గుత్తి రాజేష్, కార్తీక్ అనే యువకులు ప్రేమ పేరుతో ఆమె వెంట పడుతుండేవారు. చెడు వ్యసనాలకు బానిస అయిన రాజేష్కు స్నేహలత దూరంగా ఉండేది. దీంతో ఆమెపై రాజేష్ కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో రాజేష్ మంగళవారం స్నేహలతను తన బైక్ మీద ధర్మవరం నుంచి అనంతపురానికి తీసుకొచ్చేందుకు వెళ్లాడు. బడన్నపల్లి సమీపంలోకి వచ్చే సరికి రోడ్డు పక్కన బైక్ ఆపి ఆమెతో గొడవపడి.. గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఆమె వద్ద ఉన్న బ్యాంకు పేపర్లను శరీరంపై వేసి కాల్చి పరారయ్యాడు.
బుధవారం ఉదయం కొందరు రైతులు బడన్నపల్లి సమీపంలోని పొలంలో యువతి శవాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతురాలి వద్ద లభ్యమైన ఆధారాలతో యువతి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తమ బిడ్డను డిగ్రీ చదుతున్నప్పటి నుంచి కార్తీక్, రాజేష్ అనే యువకులు ప్రేమ పేరుతో వేధించేవారని.. అల్లారుముద్దుగా చూసుకుంటున్న తమ కూతురిని చివరకు ఇలా చేశారంటూ స్నేహలత తల్లి లక్ష్మి కన్నీరుమున్నీరైంది. రాజేష్తో పాటు కార్తీక్ కూడా ఈ ఘటన వెనుక ఉన్నాడని.. వారిద్దరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా, ఘటనా స్థలిని డీఎస్పీ రమాకాంత్, సీఐ చిన్న పెద్దయ్య, ఎస్‌ఐ జనార్ధన్‌నాయుడు పరిశీలించి.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులపై రౌడీషీట్ ఓపెన్ చేయనున్నట్లు పోలీసులు చెప్పారు. యువతి అదృశ్యం విషయం తెలియగానే వన్ టౌన్ పోలీసులు అప్రమత్తమై.. ధర్మవరం పోలీసులకు సమాచారమిచ్చారని.. రాత్రంతా ధర్మవరం, పరిసరాల్లో గాలింపు జరిపారని వివరించారు. కాగా, రాజేష్, కార్తీక్ వేధిస్తున్నట్లు గతంలో తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని వన్ టౌన్ పోలీసులు తెలిపారు.
అదుపులో రాజేష్.. పరారీలో కార్తీక్
స్నేహలత హత్య కేసును త్వరితగతిన ఛేదిస్తామని ఎస్పీ బి.సత్యయేసు తెలిపారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. గుత్తి రాజేష్ అనే వ్యక్తి స్నేహలతను హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. అతనితో పాటు మరో అనుమానితుడు కార్తీక్ కూడా ఉన్నట్లు తెలియడంతో విచారణ చేస్తున్నామని చెప్పారు. రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నామని.. కార్తీక్ పరారీలో ఉన్నట్లు చెప్పారు. స్నేహలతపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామని.. వీలైనంత వేగంగా చార్జ్షీట్ దాఖలు చేస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment