సాక్షి, నెల్లూరు : తమపై పోలీసులకు ఫిర్యాదు చేశాడనే అనుమానంతో రాజీకని పిలిచి ఓ యువకుడ్ని స్నేహితులే దారుణంగా హత్య చేసి పరారయ్యారు. ఈ ఘటన బుజబుజనెల్లూరులోని మురళీ జ్యూవెలరీషాపు వద్ద మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు...చెన్నైకు చెందిన మురగన్ భాస్కర్(25) తన తండ్రిని హత్య చేశారన్న అక్కసుతో పదిహేనేళ్ల వయస్సులోనే హత్యచేసి జైలు జీవితం అనుభవించాడు. పదేళ్ల కిందట నెల్లూరుకు వచ్చాడు. బుుజబుజనెల్లూరు న్యూకాలనీలో ఉంటూ ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు.
చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలకు పాల్పడసాగాడు. అతనిపై నెల్లూరు రూరల్ పోలీసుస్టేషన్‌లో దొంగతనం కేసు ఉంది. భాస్కర్‌కు బుుజబుజనెల్లూరు పరిసర ప్రాంతాలకు చెందిన వెంకటేష్, దేవ, ఆరీఫ్, రసూల్ స్నేహితులు. వారం రోజుల క్రితం వెంకటేష్, దేవ ఆరుబయట మద్యం, గంజాయి సేవిస్తుండగా ఎవ్వరో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని మందలించి పంపివేశారు. అయితే పోలీసులకు భాస్కరే సమాచారం అందించాడన్న అనుమానం వారిలో బలంగా నాటుకుపోయింది. ఎలాగైనా భాస్కర్‌ను అంతమొందించాలని నిర్ణయించుకున్నారు.
ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం వెంకటేష్ తన స్నేహితులైన దేవా, అన్సర్, రసూల్, మరో వ్యక్తిని ఓ దుకాణం వద్ద ఉండమని చెప్పి రాజీచేసుకుందామని భాస్కర్‌ను పిలిచాడు. దీంతో భాస్కర్ తనతో సహజీవనం చేస్తున్న మహిళ ఇంటికి సమీపంలోని మురళీ జ్యూవెలరీషాపు వద్దకు వెళ్లారు. వెంకటేష్, అతని తల్లి అక్కడకు చేరుకోగా ఇరువర్గాలు మాట్లాడుకోసాగారు. ఈ క్రమంలో వెంకటేష్ సైగ చేయడంతో మిగిలిన వారు అక్కడకు చేరుకున్నారు. తమ వెంట తెచ్చుకున్న కత్తులతో భాస్కర్‌పై విచక్షణా రహితంగా దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
వెంటనే నిందితులు అక్కడ నుంచి పరారయ్యారు. నగర డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి, నగర ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్ మిద్దె నాగేశ్వరమ్మ, వేదాయపాళెం ఎస్సైలు లక్ష్మణ్‌రావు, పుల్లారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. హత్యకు దారితీసిన పరిస్థితులను ఘటనా స్థలంలోని మహిళలను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment