Man Kills His Wife In Magabubabad | నా భార్యను నేనే చంపేశా.. ఇక దేనికైనా సిద్ధమే | Mahabubabad Crime News - Sakshi
Sakshi News home page

నా భార్యను నేనే చంపేశా.. ఇక దేనికైనా సిద్ధమే

Published Tue, Feb 16 2021 2:04 AM | Last Updated on Tue, Feb 16 2021 1:53 PM

Man Assassinated His Wife In Mahabubabad District - Sakshi

చిన్నకూతురుతో ఘటనాస్థలంలో నరేష్‌

సాక్షి, బయ్యారం: అనుమానం ఓ నిండుప్రాణాన్ని బలితీసుకుంది. కడదాకా కలసి ఉంటానని బాస చేసి అర్ధంతరంగా భార్యను కడతేర్చాడు ఓ భర్త. తానే డయల్‌ 100కు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చాడు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం నామాలపాడు సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండకు చెందిన కొండబత్తుల నరేశ్‌కు చిన్నగూడూరు మండలం జయ్యారానికి చెందిన సరిత(28)తో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు సిరివెన్నెల(10), మేఘన(6) ఉన్నారు. నరేశ్‌ డీసీఎం డ్రైవర్‌. ఆయనకు సరిత రెండోభార్య. ఇటీవల ఆమెపై అనుమానం పెంచుకున్నాడు.

కొద్దిరోజుల క్రితం సరితతో ఘర్షణపడి కొట్టగా తీవ్రంగా గాయపడింది. చికిత్స అనంతరం సరిత తల్లి వచ్చి ఆమెను జయ్యారం తీసుకెళ్లింది. ఈ క్రమంలో సోమవారం జయ్యారం వెళ్లిన నరేశ్‌ ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్తానని నమ్మబలికి చిన్నకూతురు మేఘనను వెంట తీసుకుని మహబూబాబాద్‌కు వచ్చాడు. అక్కడి నుండి మోటార్‌సైకిల్‌పై బయ్యారం మండలం నామాలపాడు అటవీప్రాంతానికి తీసుకొచ్చాడు. పథకం ప్రకారం తన వెంట తెచ్చుకున్న కత్తితో సరితను పొడిచి, ఆ తర్వాత గొంతునుమిలి హత్యచేశాడు. ఆమె మృతి చెందిందని ధ్రువీకరించుకున్నాక తన సెల్‌ఫోన్‌ నుంచే డయల్‌ 100కు ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. గార్ల–బయ్యారం సీఐ తిరుపతి, ఎస్‌ఐ జగదీశ్‌ ఘటనాస్థలానికి చేరుకుని నరేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు.  చదవండి: (మే 23న కూతురి పెళ్లి.. అంతలోనే ముగ్గురు జలసమాధి)

నేనే చంపిన... 
పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునేలోపు కొందరు స్థానికులు అక్కడికి వచ్చారు. ఏం జరిగిందని వారు ఆరా తీయగా.. భార్యను తానే చంపానని నరేశ్‌ చెప్పాడు. ‘పోలీసులకు డయల్‌ చేసిన.. వారు వచ్చేదాకా ఇక్కడే ఉంటా.. దేనికైనా సిద్ధమే.. నాకు ఉరిశిక్ష వేసినా పర్వాలేదు. ఆమె చనిపోయింది. నేను కూడా చనిపోవడానికి రెడీగా ఉన్నా... నేనేమైనా చంపలేదని చెబుతున్నానా..’అని అతడు అనడం స్థానికులను విస్మయానికి గురిచేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement