
సాక్షి,జీడిమెట్ల(హైదరాబాద్): జీతం డబ్బుల విషయంలో యజమాని గొడవకు దిగడంతో విచక్షణ కోల్పోయిన ఓ యువకు డు యజమానిని కిరాతకంగా హతమార్చిన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ కె.బాలరాజు, మృతుడి బంధువుల వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వీరేందర్ కుమార్ సేత్(55) భార్య హేమలతతో కలిసి 30 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చి చింతల్ కల్పన సొసైటీలో ఉంటున్నాడు. గత 7 ఏళ్ల క్రితం వీరేందర్ చింతల్ గణేష్‌నగర్ బస్టాప్ పక్క సందులో బైక్ మెకానిక్ దుకాణం నిర్వహిస్తున్నాడు. వీరేందర్ వద్ద ఇద్దరు యువకులు పని చేస్తుండగా నెల రోజుల క్రితం గాజులరామారం రోడామేస్త్రీనగర్‌కు చెందిన మరో యువకుడు సయ్యద్ జహీర్(26) పనికి కుదిరాడు.
ఇద్దరు యువకులు సెలవుల్లో ఉండగా గురువారం షాపులో వీరేందర్, జహీర్ ఇద్దరే ఉన్నారు. రాత్రి 10 గంటలకు వీరేందర్ బార్‌లో మద్యం సేవిస్తుండగా జహీర్ జీతం డబ్బులు ఇవ్వాలని యజమాని వీరేందర్‌ను అడిగగా వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన జహీర్ ఒక్కసారిగా వీరేందర్ తలపై ఇనుప వస్తువుతో దాడి చేసి అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి పలుమార్లు దాడికి పాల్పడి వీరేందర్‌ను హతమార్చి అక్కడి నుంచి పరారయ్యాడు. కొద్ది సేపటికి బైక్ కోసం దుకాణానికి వచ్చిన ఓ వ్యక్తి వీరేందర్ రక్తపు మడుగులో పడి మృతి చెంది ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే అక్కడకు చేరుకున్న జీడిమెట్ల పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వీరేందర్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి భార్య హేమలత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం సాంకేతిక ఆధారాలతో నిందితుడు జహీర్‌ను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment