బాలికను పరామర్శించి వస్తున్న సీపీ తఫ్సీర్ ఇక్బాల్
భిక్షాటన చేస్తూ బతుకు బండి లాగించే కుటుంబం.. ఎదుగుతున్న బిడ్డ తమ కష్టానికి తోడవుతుందనుకున్నారు ఆ అభాగ్యులు. తన ఇంట్లో పనికి చేరిన బాలికపై కన్నేశాడు ఆ పాపాత్ముడు. కళ్ల ముందే ఇంటి పనులు చేస్తుంటే కామంతో కళ్లు మూసుకుపోయి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ప్రతిఘటించిన పాపానికి ఆమెపై పెట్రోల్ పోసి మరో ఘాతుకానికి దిగాడు. తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు కట్టుకథ అల్లి ఆస్పత్రిలో చేర్పించాడు. పాపం అభం శుభం తెలియని బాలిక చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. బేల చూపులు చూస్తూ మంచానికే పరిమితమైంది. ఎన్ని కఠిన చట్టాలొచ్చినా వ్యవస్థలో మార్పు రావడం లేదు. కామాంధులకు కనువిప్పు కలగడం లేదు. ఇంటి యజమాని కొడుకు పని మనిషిపై పాల్పడిన ఘోర అకృత్యం నగరంలో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది.
సాక్షి, ఖమ్మంక్రైం: నగరంలో ఒక అనాగరిక దుశ్చర్య చోటు చేసుకుంది. చిన్నారిపట్ల ఓ కామాంధుడు కర్కశంగా ప్రవర్తించడంతో పాపం..ఆ అమ్మాయి ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ముస్తఫానగర్ పార్శిబంధంలో తన ఇంట పనిచేస్తున్న అమ్మాయి పట్ల అల్లం మారయ్య అనే వ్యక్తి అత్యాచార యత్నం చేసి, ఆపై పెట్రోలు పోసి అంతమొందించే ఘటన వెలుగుచూడడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఖమ్మంరూరల్ మండలం పల్లెగూడెంకు చెందిన జాతకాలు చెప్పుకుంటూ జీవించే వ్యక్తి తన ఆర్థిక పరిస్థితి బాగాలేక 13ఏళ్ల రెండో కూతురిని పార్శిబంధంలో ఆయుర్వేద వైద్యంచేసే అల్లం సుబ్బారావు అనే వ్యక్తి ఇంట పనిమనిషిగా మే నెలలో కుదిర్చాడు. సుబ్బారావు కుమారుడు మారయ్యనే ఈమెపై ఘాతుకానికి పాల్పడ్డాడు. (పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి.. మోసం చేశాడు)
ఒళ్లంతా కాలడంతో దూదికట్లతో విలవిలలాడుతూ చికిత్స పొందుతున్న బాధితురాలు
గత నెల 18వ తేదీన మారయ్య భార్య, తల్లి పని మీద ఊరికి వెళ్లడంతో సుబ్బారావు, మారయ్య ఇంట్లో ఉన్నారు. అదే రోజు రాత్రి బాలిక నిద్రిస్తుండగా, మారయ్య వచ్చి తన గదిలోకి రమ్మని వేధించి..అత్యాచారం చేయబోగా ఆమె రోదిస్తూ, ప్రతిఘటించింది. దీంతో..విషయం బయట పడుతుందని భావించి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంటల దాటికి ఆమె బిగ్గరగా ఏడుస్తూ కేకలు వేయడంతో పైన నిద్రిస్తున్న నిందితుడి తండ్రి సుబ్బారావు కిందకు చేరుకుని మంటలను ఆర్పివేశాడు. చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చి గుమిగూడడంతో పూజాగదిని శుభ్రం చేస్తుండగా.. ప్రమాదవశాత్తు మంట అంటుకుని గాయాలపాలైందని చెప్పి వెళ్లగొట్టారు.
ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స
ఆ తర్వాత ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి..మూడు రోజుల తర్వాత అమ్మాయి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. ఒళ్లంతా కాలిపోవడంతో పరిస్థితి విషమంగా మారింది. రూ.1.50లక్షలు ఇస్తామని, బయట చెప్పొద్దని బేరసారాలు ఆడి, బెదిరించి ఇన్ని రోజులు నెట్టుకొచ్చారు. ఆమె పరిస్థితి విషమిస్తుండడంతో ఇకపై తాము చికిత్స చేయించమని పక్కకు తప్పుకోవడంతో బాధితురాలి తల్లిదండ్రులు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా..సోమవారం వెలుగులోకి వచ్చింది. సదరు పూజ హాస్పిటల్ యాజమాన్యం కూడా పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. (సూత్రధారి రాజు.. అమలు యుగంధర్‌రెడ్డి)
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ పరామర్శించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ మాలతి సందర్శించారు. మెరుగైన చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాలిక వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ రికార్డు చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ, బీజేపీ, ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐతోపాటు ఇతర మహిళా సంఘాలు ధర్నాకు దిగాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో నగర ఏసీపీ ఆంజనేయులు, సీఐలు చిట్టిబాబు, శ్రీధర్, గోపి, వెంకన్నబాబులు బందోబస్తు ఏర్పాటు చేశారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల అదుపులో నిందితుడు
పోలీసులు సదరు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సుమోటో కేసుగా స్వీకరించాలని అడిషనల్ డీసీపీ పూజను సీపీ తఫ్సీర్ ఆదేశించారు. పోక్సో యాక్ట్, అత్యాచార, హత్యాయత్నం, నిర్భయ కేసు నమోదు చేశారు. జిల్లాకు వచ్చిన ఐజీ నాగిరెడ్డి సైతం బాలిక ఘటనపై సీపీని వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment