ప్రతీకాత్మక చిత్రం
పెదకూరపాడు: మాయమాటలు చెప్పి ఓ మహిళను ద్విచక్ర వాహనం ఎక్కించుకున్న వ్యక్తి మార్గంమధ్యలో ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిచాడు. ఆమె ద్విచక్రవాహనంపై నుంచి దూకి రక్షించండి అంటూ కేకలు వేసుకుంటూ పరుగులు తీసింది. వెంబడించిన దుండగుడు ఆమెపై లైంగికదాడికి యత్నించిన సంఘటన పెదకూరపాడు–పాటిబండ్ల రహదారిలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. మహిళ, పెదకూరపాడు సీఐలు శివనాగరాజు, సురేష్‌లు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సత్తెనపల్లి మండలం గార్లపాడు గ్రామానికి చెందిన ఓ మహిళ పెదకూరపాడు మండలం పాటిబండ్ల గ్రామంలో జరిగే బంధువు దశదిన కర్మకు హాజరైంది.
కార్యక్రమం అనంతరం తిరిగి స్వగ్రామం వెళ్లేందుకు సుమారు 6 గంటల సమయంలో పాటిబండ్ల ఆటో స్టాండ్ వద్దకు చేరుకుంది. అరగంటపాటు వేచి ఉంది. ఆటోలు రాకపోవడంతో వెనుదిరిగి బంధువుల ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైంది. గుర్తు తెలియని వ్యక్తి పెదకూరపాడులో వదిలిపెడతానని చెప్పి ద్విచక్రవాహనం ఎక్కించుకున్నాడు. పెదకూరపాడుకు వచ్చేందుకు రెండు మార్గాలు ఉండటంతో సామాజిక ఆరోగ్య కేంద్రం రోడ్డుపై తీసుకొచ్చాడు.
అనుమానంతో ఆమె ప్రశ్నించగా, ఇటువైపుగా వెళితే దగ్గర అన్ని చెప్పి నమ్మించాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించ సాగాడు. ఆమె వెంటనే బండిపై నుంచి దూకి పాటిబండ్ల వైపు పరుగులు తీసింది. వెంబడించిన దుండగుడు ఆమెను పొదల్లోకి లాకెళ్లి లైంగికదాడికి యత్నించాడు. ఆమె కేకలు వేయడంతో అదే సమయంలో పాటిబండ్లలో భవన నిర్మాణ పనులు ముగించుకొని ద్విచక్రవాహనంపై వస్తున్న పెదకూరపాడుకు చెందిన కురగంటి మాణిక్యరావు, షేక్ మస్తాన్‌లు వాహనం ఆపారు. ఆమె వారిని ఆశ్రయించింది.
వెంటనే మాణిక్యరావు ఆమెకు రక్షణ ఉండగా, మస్తాన్ గుర్తు తెలియని వ్యక్తిని వెంబడించాడు. అతను పక్కన ఉన్న నీటి గుంతలో పడ్డాడు. వెంటనే లేచి పొలాల్లో నుంచి పెదకూరపాడు–గుంటూరు వైపు పరారయ్యాడు. వెంటనే యువకులు పెదకూరపాడు సీఐలు శివనాగరాజు, సురేష్‌లకు సమాచారం ఇచ్చారు. స్పందించిన పోలీసులు క్షణంలో సంఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. మహిళను అడిగి విషయం తెలుసుకున్నారు.
నిందితుడి ద్విచక్రవాహనం (ఏపీ07 ఎక్స్ 9147) స్వాధీనం చేసుకున్నారు. మహిళ స్టేట్‌మెంట్ రికార్డు చేసి కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం ఎస్‌ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో గాలింపు చేపట్టారు. మహిళ బంధువులకు సమాచారం అందించినట్లు సీఐ శివనాగరాజు తెలిపారు. నిందితుడు వినియోగించిన వాహనం కన్కం సాంబశివరావు పేరుపై రిజిస్ట్రేషన్ అయినట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment