నోట్లోంచి డబ్బులు రప్పిస్తానని..  | Man Cheats 3 Women And Escaped With Silver In Rangareddy | Sakshi
Sakshi News home page

నోట్లోంచి డబ్బులు రప్పిస్తానని.. 

Published Mon, Dec 7 2020 9:53 AM | Last Updated on Mon, Dec 7 2020 10:25 AM

Man Cheats 3 Women And Escaped With Silver In Rangareddy - Sakshi

సాక్షి, శంషాబాద్‌: నోట్లోంచి డబ్బులు రప్పిస్తానని ముగ్గురు మహిళలను నమ్మించి వాళ్ల కాళ్ల కడియాలు, వెండిపట్టీలతో పాటు బాలికను తీసుకుని పరారైన మోసగాడి ఉదంతమిది. రంగారెడ్డి జిల్లాలోని రెండు కల్లు కంపౌండ్‌ల వేదికగా సాగిన ఈ తతంగంలో మోసపోయిన బాధితులు శనివారం రాత్రి 10 గంటల సమయంలో ఆర్‌జీఐఏ పోలీసులను ఆశ్రయిచారు. రంగంలో దిగిన పోలీసులు మైనర్‌ బాలికను సురక్షితంగా రక్షించి వారికి అప్పగించారు. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నందిగామ మండలం అంతిరెడ్డి గూడ గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు, బాలిక(15)తో కలిసి కొత్తూరు కల్లుకంపౌండ్‌కు కల్లు తాగడానికి వెళ్లారు. అక్కడ అపరిచిత వ్యక్తి వారితో మాటలు కలిపాడు. అక్కడ కల్లు సేవించి తిరిగి శంషాబాద్‌ కల్లు కంపౌండ్‌కు చేరుకున్నారు. వారితోపాటే వచ్చిన అపరిచిత వ్యక్తి తాను పూజలు చేసి నోట్లోంచి డబ్బులు రప్పిస్తానని నమ్మించాడు. అందుకు కావల్సిన పూజా సామగ్రి కోసం డబ్బులు కావాలని నమ్మించాడు.

డబ్బులు లేకపోవడంతో వారి వద్దనున్న కాళ్లకడియాలు,  వెండి పట్టీలు ఇస్తే  వాటిని విక్రయించి పూజా సామన్లు తీసుకొస్తానని చెప్పాడు. ఇది నమ్మిన వారు సుమారు 30 తులాల కాళ్ల కడియాలు, వెండిపట్టీలు ఇవ్వడంతో పాటు అతడి వెంట బాలికను పంపారు. బాలికను తీసుకొని వెళ్లిన నిందితుడు వెండి వస్తువులు విక్రయించి బాలికను నగరంలోని కూకట్‌పల్లిలో వదిలేసి వెళ్లాడు. మోసపోయినట్లు గ్రహించిన సదరు మహిళలు రాత్రి 10 గంటల సమయంలో ఆర్‌జీఐఏ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో సీఐ విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో నాలుగు బృందాలు రగంలోకి దిగాయి. అర్ధరాత్రి సమయంలో  గౌలిగూడ ఇమ్లిబన్‌ బస్‌స్టేషన్‌లో ఉన్న బాలికను గుర్తించి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు. బాలికను వారికి అప్పగించారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న మోసగాడి కోసం గాలిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

ఒంటిపై బంగారం కోసం దాడి
యాలాల: ఒంటరిగా పొలంలో పత్తి తీస్తున్న ఓ మహిళపై గుర్తుతెలియని వ్యక్తి కర్రతో దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మండల పరిధిలోని బెన్నూరు గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన లక్ష్మీ గ్రామ శివారులోఉన్న ఎకరం పొలంలో పత్తి సాగు చేసింది. కాగా ఆదివారం ఉదయం తన కొడుకు అశోక్‌తో కలిసి పొలానికి వెళ్లి ఒంటరిగా పత్తి తీస్తుంది. ఈ క్రమంలో అకస్మాత్తుగా ఓ దుండగుడు లక్ష్మీపై కర్రతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలైన లక్ష్మీ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. తల్లిపై జరిగిన దాడిని గమనించిన అశోక్‌ వెంటనే గ్రామంలోకి వెళ్లి గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో వారు పత్తి పొలానికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న లక్ష్మీని తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా గుర్తుతెలియని వ్యక్తి లక్ష్మీ ఒంటిపై ఉన్న బంగారం కోసమా? మరేమైనా కారణంతో  దాడికి పాల్పడి ఉంటాడని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దుండగుడి దాడిలో తీవ్ర గాయాలపాలైన లక్ష్మీ, బెన్నూరు పంచాయతీలో 6వ వార్డుకు సభ్యురాలిగా కొనసాగుతున్నారు. కాగా ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, సమాచారం తెలియడంతో గ్రామానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నట్లు ఎస్‌ఐ అశోక్‌బాబు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement