
సాక్షి,బుక్కరాయసముద్రం: రెండు కుటుంబాల్లో మద్యం చిచ్చు పెట్టింది. మద్యానికి బానిసలై భార్యలను కొట్టడంతో వారు పుట్టింటికి వెళ్లగా .. ఇద్దరు భర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలమేరకు... మండల కేంద్రంలోని ఇందిరాగాంధీ కాలనీకి చెందిన నాగయ్య (45) తన భార్య అశ్వర్థమ్మతో కలిసి కూలి పనులు చేసుకొని జీవనం సాగించేవారు. అయితే నాగయ్య మద్యానికి బానిసై భార్యను రోజూ కొట్టేవాడు. దీంతో భార్య అశ్వర్థమ్మ ఇటీవలే పుట్టింటికి వెళ్లిపోయింది. మనస్థాపానికి గురైన నాగయ్య శుక్రవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పురుగు మందు తాగి...
మండల పరిధిలోని కేకే అగ్రహారంలో ఓ యువకుడు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకెళితే.. కేకే అగ్రహారం గ్రామానికి చెందిన ఈశ్వరయ్య (26) ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఈశ్వరయ్య తాగుడుకు బానిసై భార్యను కొట్టేవాడు. దీంతో ఇటీవలే భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్థాపానికి గురైన ఈశ్వరయ్య పురుగుల మందు సేవించాడు. బంధువులు గమనించి అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. బంధువులు గుట్టుచప్పడు కాకుండా మృత దేహాన్ని గ్రామంలో ఖననం చేస్తుండగా విషయం పోలీసులకు తెలియడంతో మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment