
ఉరేసుకొని యువకుడి బలవన్మరణం
సాక్షి, కరీంనగర్: మండలకేంద్రం గన్నేరువరంకు వెదిర ప్రవీణ్(25) మంగళవారం అర్ధరాత్రి తన సోదరుల సమాధుల వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై సురేందర్ కథనం ప్రకారం.. గన్నేరువరం గ్రామానికి చెందిన వెదిర కనుకయ్య–కనుకవ్వ దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు చంద్రమోహన్ గతంలో కడుపునొప్పి భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి కనుకయ్య కుటుంబ కరీంనగర్‌లో నివాసం ఉంటోంది. కాగా, రెండునెలల క్రితం రెండో కుమారుడు రాజ్‌కుమార్ అనారోగ్య సమస్యలతో మనస్తాపానికి గురై కరీంనగర్‌లోని ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
చిన్నవాడైన ప్రవీణ్ నాలుగేళ్ల క్రితం ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఆటో నడుపుకుంటూ సిద్దిపేట జిల్లాలో జీవనం సాగిస్తున్నాడు. సంతానం కలగకపోవడంతో పాటు ఇద్దరు సోదరులు మృతి చెందడంతో తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. అలాగే, ‘నా చావుకు ఎవరూ కారణం కాదు’ అని ప్రవీణ్ తన ఫోన్‌లో తీసుకున్న సెల్ఫీ వీడియోను పోలీసులు గుర్తించారు. ముగ్గురు కుమారులు ఒకే తరహాలో మృతిచెందడం బాధిత కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.
Comments
Please login to add a commentAdd a comment