బెల్లంపల్లి: పోలీస్‌స్టేషన్‌లోనే ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు, మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రైల్వేస్టేషన్ ఏరియాకు చెందిన కీర్తి లక్ష్మీనర్సయ్య ఇంటిపై అతడి అన్నకొడుకు కీర్తి అంజి(24) మద్యంమత్తులో ఆదివారం ఉదయం దాడి చేశాడు.
విచక్షణ కోల్పోయి తిడుతూ..చితకబాదడంతో లక్ష్మీనర్సయ్య తలకు గాయాలయ్యాయి. పైగా చంపేస్తానని అంజి హెచ్చరించాడు. భయపడిన లక్ష్మీనర్సయ్య 100కు డయల్ చేశాడు. బెల్లంపల్లి టూటౌన్ పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ ఘటనాస్థలికి వెళ్లి అంజిని ఠాణాకు తీసుకెళ్లి విచారణ చేశారు. సాయంత్రం అంజిని ఇంటికి తీసుకెళ్లాలని పోలీసులు అతడి సోదరుడికి ఫోన్ చేయగా, తాను మంచిర్యాలలో ఉన్నానని, బెల్లంపల్లికి రాగానే ఠాణాకు వచ్చి తీసుకెళ్తానని చెప్పాడు.
రాత్రి 8.30 గంటల ప్రాంతంలో..
రాత్రి 8.30గంటల ప్రాంతంలో అంజికి ఫిట్స్ వచ్చినట్టు తెలిసింది. సీసీ ఫుటేజీ పరిశీలిస్తే అంజి పోలీస్‌స్టేషన్‌లోని వరండాలోని కురీ్చలో కూర్చుని పక్కకు ఒరిగిన దృశ్యం కనిపించింది. ఇది గమనించిన కానిస్టేబుల్ పక్క గదిలోకి వెళ్లి నీళ్లు తీసుకురాగా, మరో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లతో కలిసి నీరు తాగించడానికి ప్రయత్నించగా, స్పందించని దృశ్యాలు కనిపించాయి. ఆ తర్వాత ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యుడు పరీక్షించి అంజి మృతిచెందినట్టు ధ్రువీకరించారు.
మృతదేహాన్ని పరిశీలించిన న్యాయమూర్తి
పోలీసులే కొట్టి చంపారని మృతుడి సోదరులు, కుటుంబస భ్యులు ఆరోపించారు. దీంతో డీసీపీ సుధీర్‌రాంనాథ్ కేకన్, ఏసీ పీ పంతాటి సదయ్యలు సంఘటనపై సమీక్షించారు. పోలీసుల సమాచారం మేరకు మంచిర్యాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్‌జడ్జి అజయ్‌కల్లం సోమవారం మార్చురీకి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. అంజి మరణానికి పోలీసులే కారణమని అతడి కుటుంబీకులు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు.
ఒంటిపై గాయాలున్నాయని, పోలీసు దెబ్బలకు తాళలేక చనిపోయాడని అంజి బావ బుర్ర లక్ష్మణ్ సెల్‌ఫోన్‌లో సీసీ ఫుటేజీ దృశ్యాలను చూపించే ప్రయత్నం చేశాడు. తన బావమరి దిని పోలీసులే చంపారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. మృతుడి శరీరంపై గాయాలను పరిశీలించి న్యాయం చేయాలని బాధిత కుటుంబీకులు వేడుకున్నారు.
అంజి చనిపోయిన తర్వాత పోలీసులు సమాచారం ఇచ్చారని, అతడి సోదరులు కీర్తి వీరేశం, లక్ష్మణ్, పెద్దనాన్న కొడుకు కీర్తి వీరేందర్, చిన్నమ్మ అంజమ్మ పోలీసులపై మండిపడ్డారు. అంజికి అనారోగ్య సమస్యలు లేవని కుటుంబీకులు స్పష్టం చేశారు. కాగా, న్యాయమూర్తి సూచనల మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించగా, అంత్యక్రియలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment