ప్రియురాలు పెళ్లికి ఒప్పుకోలేదని.. | Man Deceased With Suicide About Facebook Love | Sakshi
Sakshi News home page

ప్రియురాలు పెళ్లికి ఒప్పుకోలేదని..

Published Tue, Dec 15 2020 2:46 AM | Last Updated on Tue, Dec 15 2020 2:50 AM

Man Deceased With Suicide About Facebook Love - Sakshi

వంశీకృష్ణ(ఫైల్‌)

సికింద్రాబాద్‌: ఫేస్‌బుక్‌ ప్రేమకు ఓ యువకుడు బలయ్యాడు. ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించటంతో అతడు ప్రాణాలు తీసుకున్నాడు. చిలుకలగూడకు చెందిన శ్రీనివాస్‌ అనే వ్యాపారి కుమారుడు వంశీకృష్ణ (21) సోమవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వంశీకృష్ణ తిరుమలగిరిలోని మింత్ర ఆన్‌లైన్‌ షాపింగ్‌ యాప్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. కొంతకాలం క్రితం ఫేస్‌బుక్‌ ద్వారా వంశీకృష్ణకు సికింద్రాబాద్‌ ప్రాంతంలోని ఓ ప్రైవేట్‌ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న యువతితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఇరువురు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. వంశీకృష్ణ తన ప్రేమకు చిహ్నంగా ఛాతీపై ప్రియురాలి చిత్రాన్ని సైతం టాటూ వేయించుకున్నాడు.

ఈ నేపథ్యంలోనే పెళ్లి చేసుకునే విషయంలో ఇరువురి మధ్య విభేదాలు వచ్చాయి. తన కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించడం లేదని.. వారు ఒప్పుకోనిదే వివాహం చేసుకోనని యువతి చెప్పేసింది. వంశీకృష్ణ పెళ్లి చేసుకుందామని ఒత్తిడి తెస్తుండటంతో అతడిని దూరం పెట్టింది. ఈ క్రమంలోనే విధులకు వెళ్తున్నానని చెప్పి చిలుకలగూడ నుంచి బయలుదేరిన వంశీకృష్ణ అల్వాల్‌ భూదేవినగర్‌లోని తన ప్రియురాలి ఇంటికి సమీపంలోని రైల్వేట్రాక్‌ వద్దకు చేరుకున్నాడు.

రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ కారణంగానే వంశీకృష్ణ ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయినా ఇతర కోణాల్లోనూ కేసును విచారిస్తామని రైల్వే ఇన్‌స్పెక్టర్‌ కె.ఆదిరెడ్డి తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement