మల్కన్‌గిరి(భువనేశ్వర్): పేదరికం ఓ కుటంబానికి పెద్దను దూరం చేసింది. పుట్టెడు దుఖాన్ని దిగమింగుకొని, కుమార్తె కళ్లెదుటే తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికులను కలచి వేసింది. జిల్లాలోని చిత్రకొండ సమితి స్వాభిమాన్ ఏరియాలో ఈ ఘటన గురువారం చోటు చేసుకున్న ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పనస్‌పూట్ పంచాయతీలో సింగోల్ గ్రామానికి చెందిన మంద పంగి తన భార్య, ముగ్గురు పిల్లలతో కొంతకాలం క్రితం వరకు ఆనందంగా జీవిస్తుండేవాడు.
అయితే ఇటీవల చిన్న కుమార్తె అనారోగ్యంతో మృతిచెందింది. ఆర్థికంగా స్థోమత లేకపోవడంతోనే కూతురిని కాపాడుకోలేక పోయానని అతను మానసికంగా కుంగుబాటుకు గురయ్యాడు. మరో కుమార్తె, కుమారుడిని బాగా చదివించేందుకు వలస వెళ్లాలని అనుకున్నా.. పిల్లలపై మమకారంతో బయటకు వెళ్లలేక పోయాడు. అయితే పేదరికం అతని పాలిట శాపమైంది. పిల్లలిద్దరినీ ఎలా పెంచాలో అర్థంకాని పరిస్థితుల్లో గురువారం సాయంత్రం కుమార్తె మిలి(6)ని తీసుకొని, సమీపంలోని చిత్రకొండ జలాశయానికి వెళ్లాడు.
గట్టుపై బిడ్డను కూర్చోమని చెప్పి, ఒక్క ఉదుటున అందులోకి దూకేశాడు. తండ్రి ఎప్పటికీ బయటకు రాకపోవడంతో చీకటిపడే వరకు ఎదురు చూసిన చిన్నారి, ఏడ్చుకుంటూ వెళ్లి, గ్రామస్తులకు విషయం చెప్పింది. వెంటనే స్థానికులంతా కలిసి జలాశయంతో గాలించినా మంగి ఆచూకీ లభించలేదు. దీనిపై శుక్రవారం ఉదయం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఎట్టకేలకే శనివారం సాయంత్రం మృతదేహం లభ్యం కాగా.. పోస్టుమార్టం అనంతరం ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా... కుటుంబ పెద్దను కోల్పోవడంతో ఇప్పుడు ఎలా బతకాలని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment