ముంబై: ముంబైలోని సియోన్ రైల్వే స్టేషన్లో భార్యా భర్తలు ఒక వ్యక్తితో ఘర్షణకు దిగారు. వివాదం కాస్తా పెద్దది కావడంతో రెండు వర్గాల మధ్య కొట్లాట జరిగి భర్త బలంగా చెంపదెబ్బ కొట్టడంతో ఆ వ్యక్తి అదుపుతప్పి రైల్వే ట్రాక్‌పై పడిపోయాడు. క్షణాల వ్యవధిలో ఆ ట్రాక్‌పైకి వచ్చిన ఓ రైలు ఆ వ్యక్తిని బలంగా ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. ఈ వివరమంతా అక్కడి సీసీటీవీ ఫుటేజిలో స్పష్టంగా రికార్డయ్యింది. పోలీసులు భార్యాభర్తలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సియోన్ రైల్వేస్టేషన్లో ఆదివారం రాత్రి 9.15 ప్రాంతంలో భార్యా భర్తలు అవినాష్ మానే(35), శీతల్ మానే(31) అక్కడ ప్లాట్ఫారంపై మంఖార్డ్ వెళ్లే రైలు కోసం ఎదురు చూస్తున్నారు. అంతలోనే మృతుడు దినేష్ రాథోడ్(26) ఆమెను వెనక నుంచి తోశాడని ఆరోపిస్తూ గొడవకు దిగింది. బాధితుడిపై గొడుగుతో కూడా దాడి చేసింది. పక్కనే ఉన్న భర్త కూడా భార్యకు జతకలిసి ఇద్దరూ కలిసి దినేష్ పై దాడి చేశారు.
ఈ క్రమంలో అవినాష్ మానే దినేష్ ను బలంగా చెంప దెబ్బ కొట్టడంతో అదుపుతప్పి రైలు పట్టాలపై పడిపోయాడు. దినేష్ ప్లాట్ఫారంపైకి తిరిగి ఎక్కే ప్రయత్నం చేసినా కూడా ఫలితం లేకపోయింది. చుట్టూ ఉన్నవారు దినేష్ కు సాయం చేద్దామని ముందుకు వచ్చే లోపు రైలు వస్తుండటాన్ని చూసి వారంతా వెనకడుగు వేశారు. రెప్పపాటులో ఆ ట్రాక్ పైకి వచ్చిన రైలు వేగంగా దూసుకొచ్చి దినేష్ పైనుండి వెళ్ళిపోయింది. దీంతో అతను అక్కడికక్కడే చనిపోయాడని తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే భార్యా భర్తలు అక్కడి నుండి జారుకుని వారి నివాసమైన ధారావికి పారిపోయారు. అక్కడున్న వారు ఇచ్చిన సమాచారంతో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మొదట అవినాష్ ను తర్వాత శీతల్ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు పోలీసులు.
ఇది కూడా చదవండి: అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ తొలి జాబితా విడుదల
Comments
Please login to add a commentAdd a comment