చెన్నై: కరోనా వైరస్ ఆ ప్రేమికుల మధ్య దూరాన్ని పెంచింది. లాక్‌డౌన్ ఆ దూరాన్ని మరింత అగాధంగా మార్చింది. వారు కలుసుకునే మార్గం లేకపోవడంతో కేవలం ఫోన్లలో మాట్లాడుకుంటూ, చాట్ చేసుకుంటూ ఉండేవారు. ఆ తర్వాత అమ్మాయి ఫోన్ ఎత్తడం కూడా మానేసింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా పట్టించుకోకపోవడంతో మానసిక క్షోభ అనుభవించిన ఆ ప్రియుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. తమిళనాడులోని చెన్నైలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నైలోని కొరక్కుమ్‌లో నివసిస్తున్న 22 ఏళ్ల దురాయ్ అనే యువకుడు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తున్నాడు. (చదవండి: ఇద్దరితో ప్రేమాయణమే శ్రావణి కొంప ముంచిందా?)
కరోనా వైపరీత్యానికి ముందు వరకు ఆ ఇద్దరూ బాగానే ఉన్నారు. అయితే లాక్‌డౌన్ విధించిన నాటి నుంచి వీళ్లు ఒక్కసారి కూడా కలుసుకోలేదు. ఫోన్లు మాట్లాడుకుంటూ, చాట్‌లు చేసుకునేవారు. ఏమైందో ఏమో కానీ కొన్నాళ్లుగా ఆమె దురాయ్‌ను పట్టించుకోవడం మానేసింది. ఎన్నిసార్లు ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అతడు మనోవేదనకు లోనయ్యాడు. ఈ క్రమంలో గురువారం అతను నివసిస్తున్న భవనం మూడో అంతస్థు నుంచి దూకేశాడు. కాళ్లు విరిగి బాధతో గిలగిలా కొట్టుకుంటున్న అతడిని గమనించిన స్థానికులు వెంటనే జీఎస్ఎమ్‌సీహెచ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం అతడు కోమాలో ఉన్నట్లు ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. కాగా ఈ ఘటనపై ఆర్కే నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ఆత్మహత్యకు ముందు వీడియో తీసి..)
Comments
Please login to add a commentAdd a comment