
లక్నో: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన తమ్ముడి కుటుంబంపై రగిలిపోయాడు. వారిని ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకుని మటన్ కోసే కత్తి తీసుకుని వెళ్లాడు. ఇంట్లోకి ప్రవేశించి తమ్ముడిని.. మరదలును వారి కుమారుడిని కత్తితో విచక్షణ రహితంగా పొడిచేసి వారిని దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బదోహి జిల్లాలో చోటుచేసుకుంది.
కజియానాలో నౌషద్, జమీల్ సోదరులు. నౌషద్ మటన్ వ్యాపారి. సోదరుల మధ్య కుటుంబ కలహాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో తమ్ముడి కుటుంబాన్ని నాశనం చేయాలని భావించాడు. ఈ క్రమంలో ఆదివారం నౌషద్ తాను ఉపయోగించే మటన్ కత్తిని తీసుకుని జమీల్ (42), అతడి భార్య రూబీ (38)పై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. అనంతరం జాలి కూడా లేకుండా ఏడాది వయసున్న తమ్ముడి కుమారుడిని కూడా పాశవికంగా కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాలతో వారు ముగ్గురు అక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ సంఘటనతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. హత్య జరిగిన వెంటనే నౌషద్ తన తల్లితో పరారయ్యాడు. అతడి కోసం గాలిస్తున్నట్లు ఆ జిల్లా ఎస్పీ రామ్ బదన్ సింగ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment