రోజా (ఫైల్)
చిత్తూరు రూరల్: చిత్తూరు మండలంలోని బీఎన్‌ఆర్ పేట చెరువులో గుర్తు తెలియని మహిళ శవం ఐదు రోజుల క్రితం లభ్యమైంది. ఆ శవం వీఎన్‌ఆర్ పురం గ్రామానికి చెందిన మోహన అలియాస్ రోజా(23)గా మంగళవారం తేలింది. దీంతో తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీఎన్‌ఆర్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. రోజా తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో ఆమె భర్త ప్రకాష్, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఇక మృతదేహాన్ని బుధవారం మధ్యాహ్నం ఆ మహిళ తల్లిదండ్రులకు అప్పగించారు. సాయంత్రానికి జీడీ నెల్లూరు మండలం నల్లరాళ్ల పల్లెలో కుటుంబీకులు అంత్యక్రియలు పూర్తి చేశారు.
వద్దన్నా వెళ్లింది
రోజా ఇంటినుంచి వెళ్లిన తరువాత జరిగిన సంఘటనలను ఆమె తండ్రి చిన్నబ్బ మందడి మీడియాకు వివరించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు, భర్త దగ్గరకు వెళ్లొద్దని తండ్రి చెప్పినా, గత శుక్రవారం ఇంటి నుంచి వీఎన్‌పురానికి రోజా వెళ్లింది. శుక్రవారం సాయంత్రం నుంచి రోజా కోసం ఆమె భర్తకు ఫోన్ చేస్తే తీయలేదు. మళ్లీ శనివారం ఉదయం ఫోన్ చేస్తే, పనిమీద బయట ఉన్నానని, ఇంటికెళ్లి ఫోన్ చేస్తానని బదులిచ్చాడు.
చదవండి: (కులాంతర వివాహంతోనే హత్య)
సాయంత్రానికి కూడా ఫోన్ చేయకపోవడంతో ప్రకాష్ తండ్రికి ఫోన్ చేయడంతో అక్కడికి రాలేదని చెప్పాడు. దీంతో బంధువుల ఊర్లలో వెతికినా రోజా ఆచూకీ తెలియలేదు. ఇంటికి తిరిగి వచ్చాక, పత్రికల్లో వచ్చిన సమాచారాన్ని గ్రామస్తులు తెలపడంతో, బీఎన్‌ఆర్ పేట స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ వారు చూపించిన టవల్, ఎరుపు రంగు చున్నీ, తాళి బొట్టు, చేతికి ధరించిన దేవుడి దారం, మెడలోని నల్ల పూసల దారంతో రోజాగా గుర్తించారు. ఆమె భర్త చంపేశాడని ఫిర్యాదు చేసినట్లు తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణను కొనసాగిస్తున్న పోలీసులు మరణానికి గల కారణాలను గురువారం వెల్లడించనున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment