శివకిషోర్ (ఇన్‌సెట్) భర్త, పిల్లలతో సుజాత( ఫైల్)
సాక్షి, ఎమ్మిగనూరు: కౌతాళం మండలం పెద్దతుంబళం గ్రామానికి చెందిన సుజాత(22) ఎల్‌ఎల్‌సీలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. పెద్దతుంబళం గ్రామానికి చెందిన హనుమంతప్ప, సువార్తమ్మ కుమారుడు సుంకప్ప అదే ప్రాంతానికి చెందిన రామదాసు, పద్మ కూతురు సుజాత(22) ఐదేళ్ల క్రితం ప్రేమించి, పెద్దలను ఎదిరించి పెద్దతుంబళం పోలీస్‌స్టేషన్‌లో పెళ్లి చేసుకున్నారు. సుంకప్ప గ్యాంగ్‌మెన్‌గా తుంగభద్ర రైల్వే స్టేషన్లో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి సైనా(4), యువాంక(2), ఈరన్న (9నెలలు) పిల్లలున్నారు. కాగా పెళ్లయిన రెండేళ్లకు భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. చదువుకోలేదని నిత్యం వేధించేవాడు.
భర్తతో పాటు అత్త, మామ, బావలు ఆనంద్, దేవయ్య, ఆగ్రిఫ్ సూటిపోటి మాటలతో వేధించేవారు. ఈక్రమంలో వారం క్రితం పుట్టినింటికి వెళ్లగా తల్లి సర్దిచెప్పి పంపింది. సోమవారం సాయంత్రం డ్యూటీ నుంచి వచ్చిన భర్త.. మరోసారి గొడవ పడ్డాడు. దీంతో మనస్తాపానికి గురై పిల్లలను వదలి ఇంట్లో నుంచి రాత్రి 7గంటల సమయంలో బయటకు వెళ్లింది. ఈ విషయమై సుంకప్ప వెంటనే అత్తకు ఫోన్‌లో చెప్పడంతో ఇరు కుటుంబాల సభ్యులు కలసి గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అర్ధరాత్రి ఫిర్యాదు చేశారు.
కాగా ఉదయం ఎమ్మిగనూరు అగ్నిమాపక కేంద్రం సమీపంలోని ఎల్‌ఎల్‌సీలో మృతదేహం బయటపడింది. దుస్తులు ఉతికేందుకు వెళ్లిన వారు గమనించి పోలీసులు సమాచారం ఇచ్చారు. ట్రైనీ ఐపీఎస్ కొమ్మి ప్రతాప్ శివకిశోర్, టౌన్, రూరల్ సీఐలు ప్రభాకర్‌రెడ్డి, బీఏ మంజునాథ్, రూరల్ ఎస్‌ఐ రామసుబ్బయ్య ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. వివరాలు ఆరా తీసి కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
‘నా కూతురిని హత్య చేశారు’
భర్త, అత్త, మామ వారి కుటుంబ సభ్యులే తమ కూతురిని హత్య చేసి కాలువలో పడేశారని మృతురాలు తల్లి పద్మ బోరున విలపించింది. నిందితులను కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని పోలీసులను కోరింది. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పెద్దతుంబళం ఎస్‌ఐ చంద్ర తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment