శంషాబాద్ : తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వమనడంతో పాటు హోటల్‌ను రాసివ్వమ్మని వడ్డీ వ్యాపారి చేసిన ఒత్తిడి అతడి హత్యకు కారణమైంది. రాజేంద్రనగర్ సర్కిల్ పిల్లర్ నంబరు 248 వద్ద ఆదివారం రాత్రి జరిగిన దారుణ హత్య వివరాలను శంషాబాద్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రాజేంద్రనగర్ సర్కిల్ ఎంఎంపహాడిలో నివాసముండే షేక్ రషీద్(29) స్థానికంగా గరీబ్‌నవాజ్ హోటల్ నడిపిస్తున్నాడు. లాక్‌డౌన్‌కు ముందు హోటల్‌ను బాగు చేయడానికి ఎంఎంపహాడిలోనే నివాసముండే రియల్‌ఎస్టేట్, వడ్డీ వ్యాపారి మహ్మద్ ఖలీల్ (33) నుంచి రూ.15 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ప్రతి నెలా వడ్డీ చెల్లిస్తూ వచ్చాడు. లాక్‌డౌన్ కారణంగా హోటల్ మూసివేయడంతో స్థానికంగా మరిన్ని అప్పులు చేశాడు. ఈ క్రమంలో ఇటీవల ఖలీల్ వద్దకు వెళ్లిన రషీద్ మరో రూ.50 లక్షల అప్పుగా ఇవ్వమని కోరాడు. అందుకు ఖలీల్ నిరాకరించడంతో పాటు ముందుగా తీసుకున్న అప్పును వెంటనే చెల్లించడమో..లేదా హోటల్‌ను తన పేరుమీద రాయడమో చేయాలని ఒత్తిడి చేశాడు..
పక్కా పథకంతోనే..
ఖలీల్ ఒత్తిడి పెరుగుతుండటంతో షేక్ రషీద్ తన హోటల్‌లో వంటవాళ్లుగా పనిచేస్తున్న ఎంఎంపహాడికి చెందిన మహ్మద్ అజ్మత్(28), సయ్యద్ ఇమ్రాన్(28)తో కలిసి ఖలీల్‌ను అంతమొందించాలని పథకం వేశాడు. ఇందుకోసం రషీద్, ఇమ్రాన్‌లు చార్మినార్‌కు వెళ్లి రెండు కత్తులు కొనుగోలు చేశారు. వడ్డీవ్యాపారి ఖలీల్ ఆదివారం మధ్యాహ్నం షేక్‌రషీద్ నడిపిస్తున్న హోటల్ వద్దకు వెళ్లి వడ్డీ డబ్బులు ఇవ్వమని అడిగాడు. సాయంత్రం వరకు సర్దుతానని రషీద్ అతనికి చెప్పి పంపాడు. రాత్రి 10 గంటల సమయంలో రషీద్, అజ్మత్ ఓ ఆటోను మాట్లాడుకుని అందులో సిమెంట్ ఇటుకలు సిద్దం చేసుకుని పిల్లర్ నంబరు 248 వద్దకు చేరుకున్నారు. అక్కడికే సయ్యద్ ఇమ్రాన్‌ను రప్పించుకున్నారు. డబ్బుల కోసంఖలీల్‌ను పిల్లర్‌నంబరు 248 హెచ్‌ఎఫ్ కన్వెన్షన్ వద్దకు రావాలని రషీద్ ఫోన్ చేయడంతో అతడు హోండా యాక్టివా వాహనంపై అక్కడకి చేరుకున్నాడు.
రాత్రి 11.15 గంటల సమయంలో అక్కడికి చేరుకుని రషీద్‌తో మాట్లాడుతున్న సమయంలో వెనక్కి నుంచి అజ్మత్, ఇమ్రాన్ సిమెంట్ ఇటుకలతో దాడి చేశారు. గాయపడిన స్థితిలో పరుగులు పెడుతున్న అతడిని వెంటాడి మరోసారి కత్తులతో దాడి చేయడంతో పాటు సిమెంట్ ఇటుకలతో బాది అంతమొందించారు. అక్కడే ఉన్న మృతుడి వాహనం తీసుకుని పరారయ్యారు. అక్కడ దుస్తులు మార్చుకున్న వాళ్లు రక్తంతో ఉన్న దుస్తులను తీసుకొచ్చి వ్యవసాయ కళాశాల వద్ద పారేశారు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ఏసీపీ సంజయ్‌కుమార్, సీఐ సురేష్ సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
మంట కలిసిన మానవత్వం
కాగా ఖలీల్‌ను నడిరోడ్డుపై వెంబడిస్తూ హత్య చేస్తున్నా అక్కడున్న వారు ఏ ఒక్కరు నిందితులను ఆపే ప్రయత్నం చేయలేదు. సంఘటన జరుగుతున్న సమయంలో వాహనాలపై రాకపోకలు సాగించారే తప్ప ఏ ఒక్కరు ప్రతిఘటించలేదు. ఘటన మొత్తం పది నిమిషాల పాటు జరిగిన స్థానికులు మాత్రం సెల్‌ఫోన్‌లలో చిత్రీకరించేందుకే ఆసక్తి చూపారు.
మరిన్ని వార్తలు
ముక్కలైన ట్రాక్టర్.. ఒళ్లు గగుర్పుడిచే ప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment