లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఎస్‌ఐ యాదగిరి
సాక్షి, మియాపూర్: స్టేషన్ బెయిల్ మంజూరు చేయిస్తానని, మరో వ్యక్తి పేరును కేసులో లేకుండా చూస్తానని రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు మియాపూర్ సెక్టార్– 2 ఎస్‌ఐ యాదగిరి. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీసీపీ సూర్యనారాయణ చెప్పిన వివరాల ప్రకారం.. మియాపూర్‌నకు చెందిన షేక్ సలీమ్ పుమా కంపెనీకి చెందిన బ్రాండెడ్ దుస్తులను విక్రయిస్తుంటాడు. వీటితో పాటు ఈ కంపెనీ పేరు వాడుకొని నకిలీ దుస్తులు కూడా అమ్ముతున్నట్లు మియాపూర్ పీఎస్‌లో వారం రోజుల క్రితం సదరు కంపెనీ యజమానులు ఫిర్యాదు చేశారు.
ఈ కేసుపై మియాపూర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో షేక్ సలీమ్‌తో పాటు అతని దుకాణంలో పనిచేస్తున్న మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారు. కేసుకు సంబంధించి షేక్ సలీమ్‌కు స్టేషన్ బెయిల్ ఇవ్వడంతో పాటు అతని షాపులో పనిచేసే ఉద్యోగి పేరు కేసులోంచి తొలగించేందుకు మియాపూర్ సెక్టార్– 2 ఎస్‌ఐ యాదగిరి రూ.50 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఇందులో రూ.30 వేలకు బేరం కుదుర్చుకున్నాడు.
ఈ నెల 3న ఎస్‌ఐ యాదగిరి రూ.10 వేలు తీసుకున్నాడు. మిగిలిన రూ.20 వేలు మంగళవారం పోలీస్ స్టేషన్‌లో షేక్ సలీమ్ తీసుకుంటుండగా ఏసీబీ డీసీపీ సూర్యనారాయణ బృందం పట్టుకున్నారు. ఎస్‌ఐని అదుపులోకి తీసుకొని రూ.20 వేల నగదు స్వాదీనం చేసుకున్నారు. ఎస్‌ఐ యాదగిరి అక్రమ ఆస్తులపై దృష్టి సారించారు. మియాపూర్‌లోని వీడియో కాలనీలో ఉన్న ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ మేరకు అతడిని అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment