లక్నో: మనుషుల్లో రోజురోజుకీ నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఎన్ని తప్పులైనా చేసేందుకు నేరగాళ్లు వెనకాడటం లేదు. హత్యలు చేస్తూ, మహిళలపై అకృత్యాలు కొనసాగిస్తున్న మృగాళ్లు, ఆధారాలను మాయం చేసే క్రమంలో ఘాతుకాలకు పాల్పడుతున్న ఉదంతాలను రోజూ చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల చోటుచేసుకుంది. అత్యాచారం, హత్య కేసులో నిందితుడిగా ఉన్న రాజ్ కుమార్ అనే వ్యక్తి కేసు నుంచి బయటపడేందుకు పక్కా పథకం రచించి అడ్డంగా దొరికిపోయాడు. డబ్బు ఆశజూపి ఓ వ్యక్తిని హతమార్చిన కేసులో మరోసారి అరెస్టయ్యాడు. సినిమా స్టోరీని తలపించే ఆ ఘటన వివరాలు.. యూపీకి చెందిన కుమార్‌పై హత్యానేరం, లైంగిక దాడికి పాల్పడ్డ ఘటనలో గతంలో కేసులు నమోదయ్యాయి. (చదవండి: ఆరేళ్ల చిన్నారిపై లైంగికదాడి.. మృతి)
తన గుర్తింపును మాయం చేసేందుకు
ఈ క్రమంలో అతడు ఇప్పటికే జైలు శిక్ష అనుభవించి బెయిలుపై బయటకు వచ్చాడు. కేసుల భయం వెంటాడటంతో ఎలాగైనా వాటి నుంచి విముక్తి పొందాలని భావించాడు. ఈ విషయం గురించి భార్య, తన అనుచరులతో చర్చించి ఓ పథకం రచించాడు. తన పోలికలతో ఉన్న వ్యక్తి కోసం అన్వేషించాడు. ఈ క్రమంలో సెప్టెంబరు 23న బులంద్‌షహర్‌లో ఓ మద్యం దుకాణం వద్ద ఉన్న మత్తులో జోగుతున్న బాధితుడికి డబ్బు ఇచ్చి మరింత మద్యం సేవించేలా ప్రోత్సహించాడు. ఆ తర్వాత తన దుస్తులు కూడా ఇచ్చి వేసుకోమని చెప్పాడు. ఇందుకు అతడు వెంటనే అంగీకరించి, కుమార్ చెప్పినట్లుగా చేశాడు. ఈ క్రమంలో కాసేపటి తర్వాత అక్కడికి చేరుకున్న కుమార్ భార్య, అనుచరుడు, బాధితుడిని సమీపంలో ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి హతమార్చారు.
అనంతరం అతడి జేబులో కుమార్ ఆధార్ కార్డు, ఇతర గుర్తింపు కార్డులు పెట్టారు. ముఖం ఆనవాలు తెలియకుండా బండరాళ్లతో నుజ్జునుజ్జు చేశారు. ఆ తర్వాత కుమార్ అక్కడి నుంచి పరారై అజ్ఞాతంలోకి వెళ్లగా, సహ నిందితులు తమ తమ ఇళ్లకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని శవం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి విచారణ చేపట్టారు. మృతదేహం వద్ద దొరికిన కార్డుల ఆధారంగా అది కుమార్‌దేనని తొలుత భావించారు.
అయితే లోతుగా దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది. దీంతో కుమార్ ఇంటికి వెళ్లి అతడి భార్యను ప్రశ్నించిన పోలీసులు, ఆమె చెప్పిన వివరాల ఆధారంగా కుమార్ జాడను ట్రేస్ చేశారు. అలీఘడ్‌లో అతడిని అరెస్టు చేశారు. అతడికి సహకరించిన భార్య, అనుచరుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై గతంలో హత్య, అత్యాచారం కేసు నమోదైందని, తన స్థానంలో మరో వ్యక్తి శవాన్ని పెట్టి, తన గుర్తింపును మాయం చేసేందుకే కుమార్ ఈ నేరానికి పాల్పడ్డట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment