నల్లగొండ జిల్లాలో పోలీసులపై ఆరోపణలు
దర్యాప్తు అధికారులు కీలక సమాచారం సేకరించినట్టు చర్చ
నల్లగొండ క్రైం: ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారం నల్లగొండలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే జిల్లాలోని టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన ముగ్గురు పోలీస్ అధికారులను అదుపులోకి తీసుకున్న ప్రత్యేక అధికారుల బృందం ఆదివారం వారిని మరోసారి విచారించినట్టు చర్చ జరుగుతోంది. అప్పటి జిల్లా ఉన్నతాధికారితో నమ్మకంగా ఉన్న కానిస్టేబుల్‌తో మునుగోడు ఉప ఎన్నికలో డబ్బు పంపిణీతో పాటు వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపణలున్నాయి.
పోలీసు ఉన్నతాధికారితో ఉన్న నమ్మకాన్ని టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన పలువురు కిందిస్థాయి పోలీసుఅధికారులు దందాలు, సెటిల్‌మెంట్లకు తెర లేపారని ఆరోపణలు వచ్చాయి. మిర్యాలగూడలో రౌడీషీటర్లతో సెటిల్‌మెంట్లు, నార్కట్‌పల్లి వద్ద దొరికిన గంజాయి కేసులో వసూళ్లకు పాల్పడ్డట్టు సమాచారం. పేకాట, బియ్యం దందా చేసేవారిని ఫోన్ ట్యాపింగ్ ద్వారా పట్టుకొని బ్లాక్‌మెయిల్ చేసి వసూళ్లకు పాల్పడినట్లు చర్చ జరుగుతోంది.
పార్కులో తిరిగే ప్రేమ జంటలను, ఏదేని కేసులో ఉన్న వారిని కలవడానికి వచ్చే కుటుంబ సభ్యులైన మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు సమాచారం. పోలీసు అధికారులు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో అక్రమ సంపాదనతో ఒక పోలీస్ అధికారి గుర్రంపోడు మండల కేంద్ర సమీపంలోని 9ఎకరాల తోటను కొనుగోలు చేసినట్టు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. ఈ విషయమై దర్యాప్తు అధికారులు కీలకమైన సమాచారం సేకరించినట్టు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. దర్యాప్తు అధికారుల విచారణలో మరిన్ని విస్తుగొలిపే అంశాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment