సాక్షి, గుంటూరు(మేడికొండూరు): పొట్టకూటి కోసం వలస వచ్చి కూలీనాలీ చేసుకుని జీవిస్తూ ఇద్దరు బిడ్డల బంగారు భవిష్యత్తు గురించి కలలుగంటున్న పేద దంపతుల ఆశలను రోడ్డు ప్రమాదం చిదిమేసింది. శుభకార్యానికి వెళ్లి ఆనందంగా తిరిగి వస్తున్న ఆ చిన్న కుటుంబం సంతోషాలను అంతలోనే ఆవిరి చేసింది. టిప్పర్ రూపంలో వచ్చిన మృత్యువు తల్లీకూతుళ్లను బలితీసుకుంది. స్వల్పగాయాలతో బయట పడిన తండ్రీకూతుళ్లను శోక సముద్రంలో ముంచింది. ఈ హృదయ విదారక ఘటన మేడికొండూరు మండలం పేరేచర్ల నరసరావుపేటలోని బ్రిడ్జి దిగువన రైల్వే ట్రాక్ సమీపంలో సోమవారం జరిగింది.
ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన వేల్పుల వెంకటేశ్వర్లు, లక్ష్మి(35) దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు తేజశ్విని, నాగమల్లేశ్వరి(5) ఉన్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని పేద కుటుంబం. స్వగ్రామంలో పనులు లేకపోవడంతో కొద్దినెలల క్రితం గుంటూరు చుట్టుగుంట సమీపంలోని కొత్త కాలనీకి వలస వచ్చారు. మిర్చియార్డులో భార్యాభర్తలిద్దరూ కూలిపనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. పిల్లలను చదివించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా, కారంపూడి మండలం, ఒప్పిచర్ల గ్రామంలోని బంధువుల ఇంట జరిగిన శుభకార్యానికి ఆదివారం కుటుంబమంతా ద్విచక్రవాహనంపై వెళ్లింది. సోమవారం వారు గుంటూరుకు తిరుగుపయనమయ్యారు. కొద్దిసేపట్లో ఇంటికి చేరుకుంటామనగా.. పేరేచర్ల నరసరావుపేటరోడ్డులోని బ్రిడ్జి కింద వెనుకగా వస్తున్న టిప్పర్ బలంగా ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో లక్ష్మితోపాటు ఆమె చిన్నకూతురు నాగమల్లేశ్వరి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. వెంటేశ్వర్లు, పెద్ద కుమార్తె తేజశ్విని స్వల్పగాయాలతో బయటపడ్డారు.
తల్లడిల్లిన బాలిక
తల్లి, చెల్లి దుర్మరణంతో ఎనిమిదేళ్ల తేజశ్విని తల్లడిల్లిపోయింది. అమ్మా.. అమ్మా.. లెగమ్మా.. చెల్లీ మాట్లాడు చెల్లీ.. అంటూ గుండెలవిసేలా విలపించింది. ఆ బాలికను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. మృతదేహాలపై పడి బాలిక రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది.
క్లీనర్ లేకపోవడం వల్లేనా..!
టిప్పర్‌లో క్లీనర్ లేకపోవడం వల్ల రోడ్డుపై ఎడమవైపు ఉన్న వాహనాలను డ్రైవర్ గుర్తించలేకపోయాడని, అందువల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. దుర్ఘటనపై మేడికొండూరు సీఐ ఎండీ ఎ.ఆల్తాఫ్ హుస్సేన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment