చంద్రకళ (ఫైల్), స్రవంతి (ఫైల్)
సాక్షి, షాద్‌నగర్: కుమార్తెను బాగా చదివించాలనుకున్నారు ఆ తలిదండ్రులు.. భవిష్యత్‌లో మంచి ప్రయోజకురాలిగా చేయాలనుకున్నారు.. కానీ, ఆ అమ్మాయి ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఆమె ప్రేమ వ్యవహారం ఆ ఇంట్లో ఇద్దరిని బలి తీసుకుంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. మొగిలిగిద్ద గ్రామానికి చెందిన స్రవంతి అదే గ్రామానికి చెందిన రాందాసు అనే యువకుడు ప్రేమించుకుంటున్నారు. ఈ విషయమై స్రవంతి (17), ఆమె తల్లి చంద్రకళ (35) తరచూ గొడవపడుతుండేవారు. ఈ నెల 15న తల్లీకూతురు మళ్లీ ఘర్షణ పడ్డారు. అదే సమయంలోనే చంద్రకళ భర్త పాండు ఇంటికి వచ్చీరాగానే స్రవంతిపై కిరోసిన్ పోయడానికి ప్రయత్నించాడు.
పక్కనే ఉన్న చంద్రకళపై కూడా కిరోసిన్ పడింది. ప్రేమ వ్యవహారంపై కోపంతో ఉన్న చంద్రకళ.. కూతురుకు నిప్పంటించగా తనకు కూడా మంటలంటుకున్నాయి. దీంతో ఇద్దరూ తీవ్ర గాయాలపాలయ్యారు. చికిత్స నిమిత్తం వారిని స్థానికులు షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి, మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్‌కు తరలించారు. ఉస్మానియా ఆసుపత్రిలో 4 రోజులుగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. పాండుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు పట్టణ సీఐ శ్రీధర్‌కుమార్ తెలిపారు.
ప్రేమ వ్యవహారమే కారణమా?
మొగిలిగిద్ద గ్రామానికి చెందిన చంద్రకళ దంపతులకు ఒక కుమార్తె స్రవంతి, ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త పాండు ఆర్టీసీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇంటర్ చదువుతున్న స్రవంతి అదే గ్రామానికి చెందిన రాందాసుతో ప్రేమలో పడింది. అయితే వారిని తల్లిదండ్రులు మందలించడంతో ఇటీవల గ్రామం నుంచి వెళ్లిపోయారు. పెద్దలు నచ్చచెప్పి వీరిని మళ్లీ గ్రామానికి తీసుకువచ్చారు. తర్వాత కూడా వీరిలో మార్పురాకపోవడంతో తల్లిదండ్రులు కుమార్తెను పలుమార్లు హెచ్చరించారు. ఈ క్రమంలోనే తండ్రి క్షణికావేశంలో చేసిన పని ఇద్దరి మృతికి కారణం కాగా, తండ్రిపై కేసు నమోదు కావడంతో కుటుంబం ఛిన్నాభిన్నమైంది.
Comments
Please login to add a commentAdd a comment