
లక్ష్మీఅనూష (తల్లి)
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే తన పిల్లలను ఉరి వేసి హతమార్చిన దారుణ ఘటన ఆదివారం రాత్రి 11.30 గంటలకు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. స్థానిక మల్లయ్యపేటకు చెందిన పూలేటి లక్ష్మీ అనూష తన కుమార్తె చిన్మయి (8), కుమారుడు మోహిత్ శ్రీసత్య (5)ను హత్య చేసింది. ఆ తర్వాత ఈ విషయాన్ని తన తమ్ముడికి ఫోన్ చేసి చెప్పింది. ఆయన హుటాహుటిన వచ్చి పిల్లలను ఆస్పత్రికి తీసుకెళ్లినా అప్పటికే మృతి చెందారని వైద్యులు తెలిపారు.
త్రీటౌన్ సీఐ మధుబాబు ఆస్పత్రికి చేరుకుని నిందితురాలి నుంచి వివరాలు సేకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన పూలేటి రాముకు 11 ఏళ్ల క్రితం సీతానగరానికి చెందిన లక్ష్మీ అనూషతో వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. అయితే కుటుంబంలో కలహాలు రావడంతో రాము గతంలో ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి లక్ష్మీ అనూష మల్లయ్యపేటలో నివాసం ఉంటోంది.
ఆమె తన పిల్లలను చిత్రహింసలకు గురిచేసేదని స్థానికులు చెబుతున్నారు. శనివారం రాత్రి కూడా రక్తం వచ్చేటట్టు కొట్టిందని తెలిపారు. అయితే.. తన కుటుంబ పరిస్థితి బాగోలేదని, పిల్లలకు తిండిపెట్టలేక చంపేశానని అనూష చెబుతోంది. కానీ ఆమెకు ఆర్థిక ఇబ్బందులు లేవని, ఈ హత్యలకు వేరే కారణం ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment