తల్లిని, పిల్లల్ని కాపాడి పైకి తీసుకు వస్తున్న మత్స్యకారులు
సాక్షి,తాడేపల్లిరూరల్: అమ్మా! నాకూ తమ్ముడికి, నీకు ఈతరాదు.. అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లిపోదాం పద.. నాన్న, తాతయ్య దగ్గర మనం ఉండవద్దు అంటూ కన్న కూతురు వేడుకున్నా.. ఆ తల్లి హృదయం కరగలేదు. మామ పెట్టిన బాధలు గుర్తుకు వచ్చి గుండెను దిటవు చేసుకున్న ఆ అమ్మ బకింగ్‌హామ్ కెనాల్ లాకుల వద్ద కృష్ణానదికి పడవలు వెళ్లే దారిలో కూతురు, కొడుకుతో కలిసి కాలువలోకి దూకి శుక్రవారం ఆత్మహత్యకు యత్నించింది.
అసలేం జరిగిందంటే..
విజయవాడకు వన్‌టౌన్‌కు చెందిన పవన్ కుమార్‌కు ఖమ్మం జిల్లా రాంపురానికి చెందిన శాంతిప్రియకు తొమ్మిదేళ్లక్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక బాబు. భర్తకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో కుటుంబ బాధ్యతలు ఆమె చూసుకుంటోంది. మామ రామకృష్ణ వేధిస్తుండడంతో శాంతిప్రియ భర్తకు చెప్పింది. అయినా ప్రయోజనం లేకపోవడంతో చేసేది లేక తన పెద్దకుమార్తె స్పందన, కొడుకు తలామ్ రాజును తీసుకుని బకింగ్‌హామ్ కెనాల్ లాకుల వద్దకు వచ్చి ఆత్మహత్యకు యత్నిస్తుండగా అక్కడే విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు గమనించాడు.
అడ్డు కునే లోపలే ఆమె తన ఇద్దరు పిల్లలను కాలువలోకి తోసి తనూ దూకింది. అక్కడే చేపలు పడుతున్న నాగరాజు, యేసు, యాకోబు, క్రిస్టియన్ బాబు కాలువలోకి దూకి ముగ్గురినీ కాపాడి బయటకు తీసుకు వచ్చారు. శాంతి ప్రియ తనను ఎందుకు బతికించారు అంటూ భోరున విలపించింది. ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకు వెళ్లారు. ఆ సమయంలో పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన రామకృష్ణ ‘నీ మొగుడ్ని, రెండో కూతురిని కూడా తీసుకువెళ్లి ఆత్మహత్య చేసుకుని ఉంటే మాకు పట్టిన పీడ వదిలేదని’ అనడంతో పోలీసులు తమదైన శైలిలో అతనికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం శాంతిప్రియ తల్లిదండ్రులను పిలిపించి, పిల్లల్ని, ఆమెను ఇంటికి పంపారు.
భర్తకు కిడ్నీ దానం చేసిన శాంతిప్రియ
భర్తకు మూడేళ్ల క్రితం రెండు కిడ్నీలూ చెడిపోవడంతో భర్త తండ్రిగానీ, తమ్ముడు కానీ కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు రాలేదు. శాంతిప్రియ తన కిడ్నీని దానం చేసింది. అప్పటి నుంచి ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా సరిగా లేదు. అయినా ఇంట్లో పనిమొత్తం ఆమె చూసుకుంటోంది. మామ వేధిస్తుండడంతో మనస్తాపం చెందిన ఆమె ఎన్నిసార్లు భర్తకు చెప్పినా ఫలితం లేకపోయింది. భర్త కూడా తననే మందలించడంతో తన అమ్మానాన్నలకు చెప్పింది. వారూ సర్దుకుపోవాలని చెప్పడంతో ఏం చేయాలో పాలుపోక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. రెండో కుమార్తెను భర్త బయటకు తీసుకెళ్లడంతో ఆ సమయంలో మిగిలిన ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యకు యత్నించింది.
Comments
Please login to add a commentAdd a comment