సీఐపై కిరోసిన్‌ దాడి.. హత్యాయత్నం కేసు నమోదు | Murder Attempt Case Register On Jawahar Nagar Incident | Sakshi
Sakshi News home page

సీఐపై కిరోసిన్‌ దాడి.. హత్యాయత్నం కేసు నమోదు

Published Fri, Dec 25 2020 3:34 PM | Last Updated on Fri, Dec 25 2020 3:41 PM

Murder Attempt Case Register On Jawahar Nagar Incident - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: జవహర్‌నగర్‌ ఘటనలో పలువురిపై కేసు నమోదైంది. సీఐ భిక్షపతి, కానిస్టేబుల్‌ అరుణ్‌పై కిరోసిన్‌ పోసి హత్యాయత్నానికి పాల్పడ్డారని పోలీసులు కేసు నమోదు చేశారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే అధికారులపై దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిన్న మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌లోని ప్రభుత్వ భూముల్లో ఆక్రమణల తొలగింపు సందర్భంగా ఉద్రిక్తత ఏర్పడిన విషయం తెలిసిందే. (కూల్చివేతలో ఉద్రిక్తత)

ఆక్రమణలను తొలగించడానికి వెళ్లిన మున్సిపల్‌, రెవెన్యూ, పోలీసు అధికారులపై కబ్జాదారులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సీఐ భిక్షపతి, కానిస్టేబుల్‌ అరుణ్‌ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో  ఆక్రమణదారులు పూనమ్‌ చంద్‌, నిహాల్‌ చంద్‌, శాంతిదేవి, నిర్మల్‌, బాల్‌సింగ్‌, చినరాం పటేల్‌, గీత, గోదావరి, యోగి కమల్‌, మదన్‌పై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదుచేశారు. వీరితోపాటు స్థానిక నాయకులు శంకర్‌, శోభారెడ్డిపై కూడా కేసు రిజిస్టర్‌ చేశారు. ఈ ఘటనపై ఉప్పల్‌ సీఐ రంగస్వామి ఆధ్వర్యంలో దర్యాప్తు నిర్వహిస్తున్నారు. మల్కాజ్‌గిరి డీసీపీ రక్షితామూర్తి దర్యాప్తును పర్యవేక్షించనున్నారు. 

భూ కబ్జాదారుల దాడిలో గాయపడిన సీఐ భిక్షపతిరావు, కానిస్టేబుల్‌ అరుణ్‌ సికింద్రాబాద్‌లోని యశోద దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఐసోలేషన్‌లో ఉంచి వారికి చికిత్స అందిస్తున్నారు. భిక్షపతిరావు కాళ్లు, చేతులకు 45 శాతం కాలిన గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఘటన నేపథ్యమిదీ..
జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని సర్వే నంబర్‌ 432లో 1,500 గజాల స్థలాన్ని మహిళల కోసం పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్మించాలని 6 నెలల కింద అప్పటి కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ భూమిపై కన్నేసిన కబ్జాదారులు రాత్రికి రాత్రే గదులు నిర్మించడంతో ఎమ్మార్వో గౌతమ్‌కుమార్‌ నేతృత్వంలోని బృందం నేలమట్టం చేసింది. అప్పటినుంచి ఆ భూమిని తాత్కాలిక డంపింగ్‌ కేంద్రంగా మున్సిపల్‌ అధికారులు వాడుతున్నారు. అయినా కూడా జవహర్‌నగర్‌ వాసి పూనమ్‌ చంద్‌ కుటుంబం మళ్లీ రెండు గదులు నిర్మించి ఆ భూమిని దక్కించుకోవాలని ప్లాన్‌ చేశారు. అయితే వాసం వెంకటేశ్వర్లు స్థానంలో కలెక్టర్‌గా వచ్చిన శ్వేతా మహంతి ఆ భూమిలో మహిళల కోసం షీ టాయిలెట్స్‌ పనులు చేపట్టాలంటూ మళ్లీ ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారం రోజుల కింద ఇక్కడకు వచ్చిన కార్పొరేషన్‌ అధికారులను పూనమ్‌ చంద్‌ కుటుంబసభ్యులు చనిపోతామంటూ బెదిరించడంతో వెనుదిరిగారు.

మళ్లీ గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో 20 నుంచి 30 మంది పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆ రెండు గదులను కూల్చేందుకు వచ్చారు. జేసీబీ యంత్రాలతో తొలగించేందుకు సిద్ధం అవుతుండగా పూనమ్‌ చంద్, శాంతి కుమారి ఆ గదిలోకి వెళ్లి పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని గడియపెట్టుకున్నారు. ఇది గమనించిన ఎస్సై సైదులు, ఇతర సిబ్బంది అక్కడికి వెళ్లగా, గది కిటికీలోంచి కారం పొడి చల్లారు. కర్రలకు బట్టలుచుట్టి వాటిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి బయటకు విసిరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement