హలో..60 సెకన్లలో లోన్ ఇస్తామని మీరు పెట్టిన పోస్టు చూసి లోన్ కోసం వివరాలు పంపింది నేనే. చెప్పండి.. మీకు ఎంత లోన్ కావాలి. ఎంత ఇస్తారండి. రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు ఇస్తాం. మీ ఆధార్, పాన్ కార్డు, ఒక చెక్కు, 2 ఫొటోలు మా ఆన్‌లైన్ అడ్రస్‌కు అప్‌లోడ్ చేయండి. (కొంతసేపటి తర్వాత) మీరు చెప్పినట్టే అవన్నీ అప్‌లోడ్ చేశా. ఓకే. ప్రాసెసింగ్ ఫీజుగా రూ.3,500 మా ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేయండి. అదేంటి. మాకు ఇచ్చే లోన్‌లో మీ ఫీజు తీసుకుని మిగిలిన డబ్బులు ఇవ్వొచ్చుగా.. మా కంపెనీ రూల్స్ అందుకు అంగీకరించవు. ముందు ప్రాసెసింగ్ డబ్బులు చెల్లిస్తేనే లోన్ మొత్తం మీ బ్యాంకు ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేస్తాం.ఫేస్‌బుక్ పోస్టులోని మీ కంపెనీ నిజమైనదో కాదో మాకెలా తెలుసు. మీ మాటలు నమ్మి ముందే డబ్బులు ఎలా వేస్తాం? (ఫోన్ కట్టయ్యింది)
సాక్షి, అమరావతి: ఇది విజయవాడకు చెందిన ప్రైవేటు ఉద్యోగి భార్గవ్‌కు, ముక్కూ మొహం తెలియని ఓ వ్యక్తికి మధ్య సాగిన ఛాటింగ్, ఫోన్ సంభాషణ. ఫేస్‌బుక్‌లో ఆకట్టుకునే విధంగా ఉన్న ఆన్‌లైన్ లోన్ వివరాలు చూసి అప్పు కోసం ప్రయత్నించిన భార్గవ్‌కు.. ఒకడు ముందుగా ప్రాసెసింగ్ డబ్బులు చెల్లిస్తేనే లోన్ ఇస్తామని చెప్పి, మరొకడు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజూ చెల్లించక్కర్లేదు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తే చాలని చెప్పీ బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు. ఇది ఒక భార్గవ్‌కు ఎదురైన అనుభవమే కాదు. ఎంతోమంది సామాజిక మాధ్యమాల్లో కనబడే ఇలాంటి ఆకర్షణీయమైన పోస్టులు చూసి మోసపోతున్నారు. పాన్‌కార్డు, ఆధార్ కార్డు అప్‌లోడ్ చేస్తేచాలు లక్షల మొత్తంలో అప్పులిస్తామంటూ ఎర వేస్తుండటంతో, మనవద్ద ఏం చూసి అంతమొత్తం అప్పు ఇస్తానంటున్నారనే కనీస ఆలోచన లేకుండా కొందరు వారి వలలో చిక్కుతున్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాల్లో ఈ దందా సాగుతోంది.
ముందు ఛాటింగ్ .. తర్వాత ఫోన్
అదిత్య బిర్లా, బజాజ్ ఫైనాన్స్, టాటా క్యాపిటల్ తదితర ప్రముఖ ఫైనాన్స్ కంపెనీల పేరుతో లోన్లు ఇస్తామంటూ మోసగాళ్లు తప్పుడు పోస్టులతో అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. 60 సెకన్లలో ఆన్‌లైన్ లోన్ ఇస్తామని ఒకరంటే, 5 నిమిషాల్లోనే లోన్ మొత్తం మీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తామంటూ మరొకరు.. ఆకట్టుకునే విధంగా ఎర వేస్తున్నారు. వాటిని నమ్మిన వారు వాట్సాప్, ఫేస్‌బుక్ మెస్సెంజర్‌లతో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో ఛాటింగ్ చేసి అవసరమైన ధ్రువపత్రాలు అప్‌లోడ్ చేయగానే, సదరు వ్యక్తిని మోసగాళ్లు ఫోన్ ద్వారా కాంటాక్టు చేస్తున్నారు. ముందస్తుగా రూ.3,500 నుంచి రూ.10 వేలు చెల్లిస్తే ఎన్ని లక్షలైనా అప్పుగా ఇస్తామంటూ నమ్మబలుకుతున్నారు.
సరేనన్న వారి దగ్గర్నుంచి అందినకాడికి దండుకుని ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోతున్నారు. డబ్బులు చెల్లించినవారు ఆ తర్వాత అదంతా ఫేక్ వ్యవహారమని తెలుసుకుని లబోదిబోమంటున్నారు. ఫేస్‌బుక్‌లో మనకు తెలిసిన వారి పేరుతో ఫేక్ ఖాతాలు తెరిచి, నేరుగా ఫోన్ చేయకుండా ఆ ఖాతాల ద్వారానే అత్యవసరం పేరిట పెద్ద మొత్తంలో డబ్బులడగటం వంటి మోసాలు ఈ మధ్య ఎక్కువై పోయాయి. ఎప్పటికప్పుడు కొత్త తరహా మోసాలతో బురిడీ కొట్టిస్తున్న ఆన్‌లైన్ కేటుగాళ్లు.. ఇటీవలి కాలంలో కొత్తగా లక్షల్లో అప్పులిస్తామనే పోస్టులతో పెద్ద సంఖ్యలో మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తత చాలా అవసరమని, ఏ మాత్రం రిస్క్ తీసుకున్నా మోసపోవడం ఖాయమని సైబర్ క్రైమ్ అధికారులు హెచ్చరిస్తున్నారు.
చదవండి: ప్రభుత్వ డేటాకు మరింత భద్రత
విశాఖ ఘటనలో ఏపీ సర్కార్ పనితీరు భేష్
Comments
Please login to add a commentAdd a comment