సాక్షి, నిజామాబాద్: ఈ నెల 8న నిజామాబాద్ జిల్లా శివారులోని గుండారంలో వెలుగులోకి వచ్చిన మహిళ హత్య కేసును చేధించినట్లు డీసీపీ అరవింద్ బాబు వెల్లడించారు. ఈ క్రమంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీసీపీ అరవింద్ బాబు మాట్లాడుతూ.. ‘‘సారంగాపూర్‌కు చెందిన సుగుణ అనే వివాహిత అనారోగ్య సమస్య కారణాల వల్ల గత నెల 26న చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి వచ్చింది. అయితే ఆస్పత్రిలో బెడ్లు లేకపోవడంతో రాత్రి సమయంలో ఇంటికి వెళ్లే క్రమంలో అక్కడే ఉన్న ఆటోలో ఎక్కడం జరిగింది. ఆ తర్వాత నుంచి ఆమె కనిపించకుండా పోయింది. ఈ క్రమంలో వివాహిత కుటుంబ సభ్యులు ఈ నెల 1న వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేశారు’’ అని తెలిపారు.
డీసీపీ అరవింద్ బాబు మాట్లాడుతూ.. ‘‘ఈ నెల 8వ తేదీన గుండారం శివారులోని చెరువులో సుగుణ మృతదేహం లభించింది. దర్యాప్తులో భాగంగా ఆటో డ్రైవర్ బాలాజీతో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకొని విచారించగా.. ఆ మహిళకు మాయమాటలు చెప్పి గుండారం ప్రాంతానికి తీసుకువెళ్లి అత్యాచారం చేసి హత్యచేసినట్లు అంగీకరించారు. అనంతరం మృతురాలి ఒంటిపై ఉన్న బంగారు నగలతో పాటు, సెల్ ఫోన్ తీసుకుని పారిపోయినట్లు తెలిపారు. దర్యాప్తులో భాగంగా ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాము. ఇందులో బాలాజీని పాత నేరస్థుడిగా గుర్తించడం జరిగిందని’’ అన్నారు. వీరు నాందేడ్ జిల్లా కు చెందిన వారుగా డీసీపీ అరవింద్ బాబు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment