Siddartha Murder: ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం | Nizamabad: Police Solves Siddhartha Murder case | Sakshi
Sakshi News home page

Siddartha Murder: ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం

Published Sun, May 23 2021 12:30 PM | Last Updated on Sun, May 23 2021 12:33 PM

Nizamabad: Police Solves Siddhartha Murder case - Sakshi

సాక్షి, కమ్మర్‌పల్లి: మండలంలోని హాసాకొత్తూర్‌లో ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారమే హత్యకు దారి తీసిందని పోలీసుల విచారణలో తేలింది. ఈ హత్య ఘటనలో ఏడుగురు నిందితుల్లో ఐదుగురిని శనివారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆర్మూర్‌ ఏసీపీ రఘు  తెలిపిన ప్రకారం.. మాలవత్‌ సిద్దార్థ(17), కనక రాజేష్‌ బంధువైన యువతి మధ్య ఐదారు నెలలుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. క్రమంగా సోషల్‌ మీడియాలో చాటింగ్‌ వరకు వెళ్లింది. ఈ విషయం రాజేష్‌కు తెలియడంతో తన స్నేహితులు దోన్‌పాల్‌ పృథ్వీరాజ్, జుంబరాత్‌ అన్వేష్‌తో కలిసి సిద్దార్థను బెదిరించాడు. సిద్దార్థ, అతని సోదరుడు కృష్ణలను హెచ్చరించాడు. హెచ్చరికలను ఖాతరు చేయకపోవడంతో ఎలాగైన కొట్టి భయభ్రాంతులకు గురి చేయాలని రాజేష్‌ భావించాడు. ఈ క్రమంలో బుధవారం నందిపేట్‌కు చెందిన సల్మాన్, రాకేష్‌ను హాసాకొత్తూర్‌కు రప్పించి సిద్దార్థపై దాడికి యత్నించారు. కానీ వీలు కాలేదు.

అదే రోజు రాత్రి సిద్దార్థకు క్లోజ్‌ ఫ్రెండ్‌ అయిన అదే గ్రామానికి చెందిన షేరాల బాలాగౌడ్‌ను కలిసి సిద్దార్థకు ఫోన్‌ చేసి పిలిపించాడు. సిద్దార్థ రాగానే ద్విచక్ర వాహనాలపై మెట్ల చిట్టాపూర్‌ రోడ్డులోని బర్రెల మంద వద్దకు తీసుకెళ్లారు. అక్కడ కర్రలతో విపరీతంగా కొట్టారు. ఒంటిపై గాయాలు కాగా, ద్విచక్ర వాహనంపై గ్రామానికి తీసుకువచ్చి బాలాగౌడ్‌తో బట్టలు తెప్పించి సిద్దార్థకు వేశారు. బాలాగౌడ్‌ ఇంటి వద్దే పడుకోబెట్టారు. అర్ధరాత్రి దాటాక సిద్దార్థ పరిస్థితి విషమించడంతో ఊపిరి ఆడలేదు. దీంతో బాలాగౌడ్‌ రాజేష్‌కు ఫోన్‌ చేసి సమాచారం అందించాడు. రాజేష్‌ బాలాగౌడ్‌తో కలిసి సిద్దార్థను తన కారులో మెట్‌పల్లిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. తెల్లవారుజామున ఉప సర్పంచ్‌ రాజేశ్వర్‌కు ఫోన్‌ చేసి సిద్దార్థ కోవిడ్‌తో మరణించాడని చెప్పి అంత్యక్రియలకు ఏర్పాటు చేయాలని కోరాడు.

గ్రామానికి చెందిన పీఎంపీ వైద్యుడు మథీన్‌తో కరోనా మృతిగానే రాజేశ్వర్‌కు చెప్పించాడు. కుటుంబీకులకు కూడా కరోనా మృతిగానే సమాచారం అందించాడు. అంబులెన్స్‌కు కూడా కరోనా మృతిగానే చెప్పి మృతదేహాన్ని ఆర్మూర్‌ ప్రభుత్వాస్పత్రికి చేర్చాడు. కరోనాతో మృతి చెందాడని చెప్పగా సిద్దార్థ కుటుంబ సభ్యులు అనుమానించి ఆర్మూర్‌లో మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహంపై గాయాలు ఉండడంతో ఆరా తీశారు. కొట్టిన దెబ్బలతోనే మృతి చెందినట్లు విషయం బయట పడింది. ఈ కేసులో రాజేష్‌తో పాటు, పృథ్వీరాజ్, అన్వేష్, బాలాగౌడ్, మథీన్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. సల్మాన్, రాకేష్‌ పరారీలో ఉన్నారని ఏసీపీ తెలిపారు.  

చదవండి: వాట్సప్‌ చాటింగ్, ఫోన్‌ కాల్స్‌.. సిద్ధార్థది పరువు హత్య?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement