సాక్షి, మైలార్‌దేవ్‌పల్లి: బంధువుల వలే వివాహాలకు హాజరై అదును చూసి విలువైన వస్తువులు, నగుదును కాజేస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు గురువారం రిమాండ్‌కు తరలించారు. వీరిలో ఆరు సంవత్సరాల బాలిక కూడా ఉంది. మైలార్‌దేవ్‌పల్లి ఇన్‌స్పెక్టర్ వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాజ్‌ఘడ్ జిల్లాకు చెందిన ప్రశాంత్ (22), శ్రావణ్ (21)తోపాటు ఓ మహిళ, ఆరు సంవత్సరాల బాలికతో నెలరోజుల క్రితం నగరానికి వచ్చారు.
కారును అద్దెకు తీసుకోని మైలార్‌దేవ్‌పల్లి, రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌ల పరిధిలోని ఫంక్షన్‌హాల్స్‌లో జరిగే శుభకార్యాల్లో బంధువుల వలే హాజరయ్యేవారు. ఆయా శుభకార్యాల్లో బంధువులు ఇచ్చిన ఖరీదైన గిప్టులను ఎక్కడ పెట్టారో తెలిపి బాలికను పంపించే వారు. ఆడుకుంటూ వెళ్లి ఆ చిన్నారి వాటిని తీసుకువచ్చి ఆ మహిళకు అందించేది. దొంగలించిన సొత్తుతో నిమిషాల వ్యవధిలో శుభకార్యం నుంచి వెళ్లిపోయే వారు. మైలార్‌దేవ్‌పల్లితో పాటు రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇలా మూడు దొంగతనాలకు పాల్పడ్డారు.
గతనెల మూడో వారంలో జరిగిన శుభకార్యంలో విందు నిర్వహించిన కుటుంబ సభ్యులు విలువైన వస్తువులతో పాటు నగదును ఓ బ్యాగ్‌లో వేసి స్టేజిపైనే ఉంచారు. ఈ శుభకార్యంలో పాల్గొన్న చిన్నారి చాకచక్యంగా దానిని తీసుకోని ఉడాయించింది. విందులో ఏర్పాటు చేసిన వీడియో కెమెరాలో చిన్నారి బ్యాగ్ తీసుకువెళ్లిన సంఘటన రికార్డయ్యింది. కుటుంబ సభ్యులు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు శంషాబాద్ ఎస్‌ఓటీ సహాయాన్ని కోరారు. ఆ రోజు ఫంక్షన్‌హాల్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో పాటు బయటకు వెళ్లిన వాహనాల పూర్తి వివరాలను సేకరించి బుధవారం నిందితులైన ఇద్దరు యువకులు, మహిళ, చిన్నారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఐ20 కారు, నాలుగు సెల్‌ఫోన్లు, రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను గురువారం రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment