సాక్షి ప్రతినిధి, విజయవాడ: స్పా, సెలూన్లు, వెల్‌నెస్ సెంటర్లు, బ్యూటీ పార్లర్ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై విజయవాడ పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. గత వారం రోజులుగా వీటిపైన పోలీసులు విస్తృతంగా దాడులు చేస్తున్నారు. ఎనీ్టఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా ఆదేశాల మేరకు డీసీపీ విశాల్ గున్నీ నేతృత్వంలో ఈ ఆపరేషన్ చేపట్టారు. మొత్తం 18 బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొంటున్నాయి.
‘స్పా’ట్ పెట్టారు..
నగరంలో మాచవరం, మొగల్రాజపురం, బెంజిసర్కిల్ తదితర ప్రాంతాల్లో 190కి పైగా స్పా సెంటర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీటిలో ఇప్పటికే 60 స్పాలపై దాడులు చేసి, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 46 స్పాలను సీజ్ చేశారు. పోలీసులు దాడులు చేస్తుండటంతో కొన్ని స్పాలను నిర్వాహకులు మూసివేశారు. అలాంటి వాటిపైనా పోలీసులు దృష్టి సారించి వివరాలు సేకరిస్తున్నారు. విజయవాడ నగరంలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు.
వీటిపై దృష్టి..
ప్రధానంగా వీరి తనిఖీల్లో నిబంధనల ప్రకారం వ్యాపార నిర్వహణ కోసం లైసెన్సు తీసుకొన్నారా లేదా? ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించారా లేదా? వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. చాలా వాటికి ఇలాంటి అనుమతులు లేకుండానే అనధికారికంగా నడుపుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. కొన్ని సెంటర్లలో స్పా, మసాజ్‌ల పేరుతో ఏకంగా క్రాస్ మసాజ్ జరుగుతున్నట్లు గుర్తించారు. ఇలా ఇప్పటి వరకు దివ్య యూనిసెక్స్ అండ్ బ్యూటీ సెలూన్, గోల్డెన్ ఓక్స్, హనీ బ్యూటీస్పా, ఫర్ యూ ఫ్యామిలీ సెలూన్ సెంటర్లలో క్రాస్ మసాజ్ జరుగుతున్నట్లు గుర్తించి, అందుకు తగిన ఆధారాలు లభించడంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. ఇప్పటికే ఏడుగురు స్పా నిర్వాహకులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. 18 మంది విటులను అదుపులోకి తీసుకున్నారు. 28 మంది యువతులను ఈ మురికి కూపం నుంచి కాపాడి, వారిని తాత్కాలికంగా హోమ్స్‌లో ఉంచి వారి సొంత ఊళ్లకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.
పేరు మాత్రమే ఫ్యామిలీ..
చాలా సెంటర్లు ఫ్యామిలీ స్పాలంటూ పేర్లు పెట్టి గుట్టుచప్పుడు కాకుండా క్రాస్ మసాజ్ చేయిస్తున్నారు. ఇందుకోసం ఢిల్లీ, హరియాణా, ఈశాన్య రాష్ట్రాలు, థాయ్‌ల్యాండ్ చెందిన యువతులను తెచ్చి వీరితో క్రాస్ మసాజ్‌తో పాటు వ్యభిచారం కూడా చేయిస్తున్నట్లు తెలుస్తోంది. యువతుల ఆర్థిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని, డబ్బు ఆశ చూపి, ఇక్కడికి వచ్చాక బలవంతంగా ఈ మురికికూపంలో దించుతున్నట్లు సమాచారం. ఈ తరహా స్పాల్లోకి వెళ్లేందుకు నిర్వాహకులు హై సెక్యూరిటీ సిస్టం ఏర్పాటు చేసుకున్నారు. ఫింగర్ ప్రింట్ పెడితేనే లోపలికి అనుమతి ఉంటుంది. మొదట సాధారణ మసాజ్ సెంటర్‌లాగే నిర్వహించి.. ఆ తర్వాత నెమ్మదిగా కస్టమర్లను తమ మార్గంలోకి మలచుకుంటున్నట్లు తెలుస్తోంది. స్పాలోకి వెళ్లే విటుల నుంచి కూడా పెద్ద మొత్తంలో గుంజుతున్నట్లు సమాచారం.
గట్టి నిఘా..
విజయవాడలో ఈ విష సంస్కృతి ప్రబలకుండా, వీటిపైన పోలీసులు గట్టి నిఘా పెట్టారు. ఆయా స్పా నిర్వాహకులకు పెద్ద తలకాయలతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఈ స్పాల నిర్వహణలో పోలీసుల సహకారం ఏమైనా ఉందా? అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. రాష్ట్ర నిఘా వర్గాలు ఈ వ్యవహారంపైన సమాచారం సేకరిస్తున్నాయి.
ఉపేక్షించేది లేదు..
స్పా సెంటర్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. వీటిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. ఇటీవల మూసి వేసిన స్పాల గురించి కూడా ఆరా తీస్తున్నాం. ఆయా స్పాలను ఎప్పుడు మూసివేశారు? దాని నిర్వాహకులు ఎవరూ? గతంలో ఎన్నిరోజుల పాటు నిర్వహించారు? వంటి అంశాలను పరిశీలిస్తున్నాం. నగరంలోని ఏ ప్రాంతాలలోనైనా ఇలాంటివి జరిగితే.. 7328909090 (వాట్సాప్)కుగానీ, డయల్100గానీ సమాచారం ఇవ్వవచ్చు. వీటితో పాటు ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా కూడా తెలుపవచ్చు. సమాచారం ఇచ్చే వ్యక్తుల పేర్లను గోప్యంగా ఉంచుతాం. నిర్భయంగా సమాచారం ఇవ్వవచ్చు.
– విశాల్ గున్నీ, డీసీపీ, ఎన్టీఆర్ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment