భేటీలో రాహుల్, ప్రియాంక నవ్వులు
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కోసులో ఐదు రోజుల పాటు 50 గంటలకు పైగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని సుదీర్ఘంగా విచారించిన ఈడీ అధికారులు ఆయన ఎలాంటి విసుగూ లేకుండా ఎంతో ఓర్పుగా, సహనంగా ఉండటం చూసి ఆశ్చర్యపోయారట. విచారణ నేపథ్యంలో బుధవారం తనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలతో ఆయన ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో భేటీ అయ్యారు.
తనకు మద్దతుగా పలు కార్యక్రమాలు చేపట్టినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఈడీ విచారణ సాగిన తీరుతెన్నులను వారితో సరదాగా పంచుకున్నారు. ‘‘అలుపు సొలుపు లేకుండా గంటల తరబడి కదలకుండా కుర్చీలో కూర్చునేంత ఓపిక ఎలా వచ్చిందని అధికారులు నన్ను ప్రశ్నించారు. ముందు చెప్పను పొమ్మన్నాను. విపాసన ధ్యానప్రక్రియను సాధన చేస్తుండటమే అందుకు కారణమని తర్వాత సరదా కారణం చెప్పా.
అసలు కారణమేంటో తెలుసా? ఆ చిన్న గదిలో, ముగ్గురు ఈడీ అధికారుల సమక్షంలో కూర్చున్నా నేను ఒంటరిగా ఉన్నాననే ఫీలింగ్ కలగలేదు. కాంగ్రెస్ కార్యకర్తలంతా స్ఫూర్తి నా వెంటే ఉంది. పైగా 2004 నుంచీ ఓ కార్యకర్తగా పార్టీ కోసం చేస్తున్న పని నాకు ఎంతో ఓపికను నేర్పింది’’ అన్నారు. ‘‘ఐదు రోజులూ ఈడీ ప్రశ్నలన్నింటికీ జవాబిచ్చాను. వాటిని చెక్ చేసుకున్నాను’’ అన్నారు. అగ్నిపథ్ పథకంతో సాయుధ దళాలను మోదీ సర్కారు బలహీనపరుస్తోందని రాహుల్ దుయ్యబట్టారు. మన భూభాగాన్ని చైనా క్రమంగా ఆక్రమించుకుంటుంటే కళ్లు మూసుకుంటోందని ట్వీట్ చేశారు.
27న దేశవ్యాప్త ర్యాలీ
అగ్నిపథ్‌ను రద్దు చేయాలనే డిమాండ్‌తో 27న కాంగ్రెస్ దేశవ్యాప్తంగా భారీ ర్యాలీ, ప్రదర్శనలు చేపట్టనున్నట్టు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment