ఘటనా స్థలం వద్ద డాగ్‌స్క్వాడ్ తనిఖీ
జగదేవ్‌పూర్(గజ్వేల్): ఆదివారం రాత్రి వరకు బాగానే ఉన్న దంపతులు సోమవారం ఇంట్లో విగతజీవులుగా పడి ఉన్నారు. ఇద్దరి మెడలకు తాడు ఉండి కింద పడడం పలు అనుమానాలకు తావిస్తోంది. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నారా.. లేదా ఆస్తి కోసం ఎవరైనా హత్య చేశారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని తిగుల్ గ్రామానికి చెందిన స్వర్గం సత్యనారాయణ (65) బాలమణి (58) దంపతులు అనుమానాస్పదస్థితిలో మృతిచెందారు. సత్యానారాయణ గ్రామంలో చిన్నపాటి వ్యాపారం చేస్తుండగా, భార్య బీడీలు చుడుతూ జీవనం సాగిస్తున్నారు.
కాగా వీరికి సంతానం లేకపోవడంతో ఓ అమ్మాయిని దత్తత తీసుకున్నారు. గజ్వేల్‌కు చెందిన యువకుడితో పెళ్లి కూడా జరిపించారు. సత్యనారాయణ సోదరుడు బుచ్చయ్యకు కూడా పిల్లలు లేకపోవడంతో అక్కారం గ్రామానికి చెందిన శ్రీను అనే బాలుడిని దత్తత తీసుకుని పెంచుకున్నాడు. మరో సోదరుడు ప్రభాకర్ చిన్నప్పుడే తంగళ్లపల్లిలో స్థిరపడ్డారు. కొన్నేళ్ల క్రితం బుచ్చయ్య దంపతులు అనారోగ్యంతో మృతి చెందారు.అప్పటి నుంచి శ్రీను ఒంటరిగానే ఉంటున్నాడు. సత్యనారాయణ, బుచ్చయ్యకు సంబంధించి 39 గుంటల భూమి ఉండడంతో రెండు నెలల క్రితం రూ. 25 లక్షలకు విక్రయించారు. అప్పటి నుంచి చిన్నపాటి గొడవలు ప్రారంభం అయ్యాయి. సత్యనారాయణ ఇద్దరు చెల్లెళ్లలకు తలా రూ. లక్ష ఇవ్వగా, శ్రీనుకు రూ. 3 లక్షలు ఇచ్చారు. మిగతా డబ్బులు సత్యనారాయణ బ్యాంకు ఖాతాలో జమ చేశారు.
శ్రీనుకు పెళ్లి కాకపోవడంతో పెళ్లి చేయాలని పెద్దల సమక్షంలో నిర్ణయించారు. ఈక్రమంలో సోమవారం ఉదయం 8 గంటలు దాటినా సత్యనారాయణ తలుపులు తీయలేదు. స్థానికుడైన వెంకట్‌రెడ్డి ఫోన్ చేసినా లేపలేదు. దీంతో ఇంటి వెనకలా తలుపును తట్టి చూడగా ఇంట్లో విగతజీవులుగా కనిపించారు. వెంటనే అతడు సర్పంచ్ భానుప్రకాష్‌రావుకు సమాచారం అందించాడు. అనంతరం జగదేవ్‌పూర్ పోలీసులకు సమాచారం తెలిపారు. వెంటనే ఏసీపీ రమేష్, గజ్వేల రూరల్ సీఐ కమలాకర్, ఎస్‌ఐలు రాజు, పుష్పరాజు ఘటనా స్థలికి చేరుకొని క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌లతో పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్ ఇంటి చుట్టూ తిరిగి పక్కన ఉన్న ఫంక్షన్‌హాల్ ముందు నుంచి రోడ్డుపై వెళ్లి ఆగింది. ఏసీపీ రమేష్ మాట్లాడుతూ.. దంపతుల మృతిని అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నామని తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అనుమానాలెన్నో..
సోదరుడి పొత్తుల భూమి అమ్మగా సత్యనారాయణకు మరో ఎకరన్నర భూమి ఉంది. డబ్బులు, ఉన్న భూమి, ఆస్తి కోసం హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. బీరువాను చూడకపోవడం, అందులో సుమారు రూ. 2 లక్షల వరకు డబ్బులు, బంగారు ఆభరణాలు అలాగే ఉండడం, బాలమణి ఒంటిపై నగలుఉన్నాయి. వారి ఒంటిపై ఎలాంటి గాయాల ఆనవాళ్లు కూడా లేవని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment