ధర్మవరం అర్బన్: కియా సంస్థకు కార్మికు లను చేరవేసే బస్సు డ్రైవర్ సోమవారం తెల్లవారుజామున ధర్మవరం పట్టణంలో భీభత్సం సృష్టించాడు. అతి వేగంగా వాహనాన్ని రాంగ్ రూట్‌లో నడుపుతూ ఒకరి మృతికి కారణమయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... ధర్మవరం మండలం పోతుకుంట కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ నాగార్జున తన ఆటోలో ఎర్రగడ్డలు వేసుకుని సోమవారం తెల్లవారుజామున ధర్మవరానికి బయలుదేరాడు. అదే సమయంలో గిర్రాజుకాలనీకి చెందిన రవి తన బంధువైన గీతానగర్ నివాసి నరేంద్ర(24)తో కలిసి ద్విచక్రవాహనంలో ధర్మవరం పట్టణంలోకి ప్రవేశించారు. ఈ రెండు వాహనాలు రైల్వే బ్రిడ్జిపై వెళుతుండగా ఎదురుగా రాంగ్‌రూట్‌లో వేగంగా దూసుకొచ్చిన కియా బస్సు ఢీకొట్టింది.
ఘటనలో ఆటో డ్రైవర్ నాగార్జున తీవ్రంగా గాయపడ్డాడు. ద్విచక్రవాహనంలో వెనుక కూర్చొన్న నరేంద్ర కిందకు పడగా అతని తల మీదుగా బస్సు చక్రం దూసుకెళ్లింది. తల నుజ్జునుజై అక్కడికక్కడే నరేంద్ర మరణించాడు. ద్విచక్ర వాహనం నడుపుతున్న రవి.. బైకుకు, బస్సుకు మధ్యలో ఇరుక్కుపోయాడు. బస్సు డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా అలాగే బైక్‌ను లాక్కెళ్లాడు. మార్నింగ్ వాక్‌కు వచ్చిన వారు గట్టిగా కేకలు వేస్తున్నా డ్రైవర్ బస్సు ఆపకుండా వేగంగా ముందుకెళ్లాడు. దాదాపు అర కిలోమీటరు దూరం వెళ్లాక బస్సు ఆపి బైకు కింది నుంచి స్థానికుల సాయంతో రవిని పక్కకు లాగారు. బస్సు కింద ఇరుక్కున బైకును వెలికి తీయకుండానే డ్రైవర్ మరోసారి బస్సును ముందుకు దూకించాడు.
వేగంగా బస్సును జిగ్‌జాగ్ డ్రైవింగ్ చేస్తూ పోతుకుంట సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద బస్సును ఆపి ఉడాయించాడు. కాగా, ద్విచక్రవాహనంలో ఇరుక్కుపోయిన రవికి కాలు విరిగి ఎముక బయటకు వచ్చింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడకు చేరుకుని రవిని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన బెంగళూరుకు తీసుకెళ్లారు. ఆటో డ్రైవర్ నాగార్జునను అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. ఘటనపై ధర్మవరం అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment