మకాంలో మృతి చెంది పడి ఉన్న ఎడ్లు- రాష్ట్ర ప్రథమ స్థానం సాధించిన ఎడ్లతో సత్యేంద్రకుమార్
సామర్లకోట: రైతుకు ఆ ఎడ్లు అంటే ప్రాణం.. అవి రాష్ట్ర, జిల్లా స్థాయి పందేల్లో అనేక బహుమతులు సాధించాయి.. అలాంటి మూగ జీవాలపై ఎవరి కన్నో పడింది.. ఎందుకో.. ఏమో వాటికి విషమిచ్చి చంపేశారు.. ఈ సంఘటన సామర్లకోటలో కలకలం రేపింది.. దీనిపై బాధిత రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుమంత్ తెలిపారు. ఆ వివరాల ప్రకారం.. సామర్లకోట మాండవ్య నారాయణస్వామి ఆలయం సమీపంలోని ఓ షెడ్డులో పందేల్లో పాల్గొనేందుకు ఎడ్లను రైతు వల్లూరి సత్యేంద్రకుమార్ పెంచుతున్నారు. 20 ఏళ్లుగా పలు పరుగు పందేల్లో ఆయన పెంచిన ఎడ్లు పాల్గొని పతకాలు సాధించాయి. ఈ నెల 11న మాచవరం, 19న రాజానగరంలో జరిగిన రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పందెంలో ప్రథమ స్థానంలో నిలిచాయి. ఇందులో భాగంగానే శుక్రవారం కృష్ణా జిల్లా కైకలూరులో జరిగిన పరుగు పందెంలో ఎడ్లు పాల్గొని ప్రథమ స్థానం దక్కించుకున్నాయి. (చదవండి: ప్రతీకారం: ఫేస్‌బుక్‌లో అమ్మాయి పేరుతో వల వేసి)
ఆ ఆనందంతో కృష్ణా జిల్లా నుంచి శుక్రవారం రాత్రి 10 గంటలకు సామర్లకోటకు ఆ రైతు సత్యేంద్రకుమార్ వచ్చారు. ఆ జీవాలను మకాంలో ఉంచి అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఆయన ఇంటికి వెళ్లిపోయారు. శనివారం ఉదయం వచ్చి చూసేసరికి నాలుగు ఎడ్ల నోటి నుంచి నురగ వచ్చి మృతి చెంది పడి ఉన్నాయి. ఆ పాకలోని దూడకు ఏమీ కాలేదు. ఇందులో పరుగు పందెం కోసం ఇటీవల ఓ ఎద్దును రూ. ఐదు లక్షలకు కొనుగోలు చేశానని సత్యేంద్రకుమార్ తెలిపారు. (చదవండి: ప్రేయసికి వివాహం.. ప్రియుడి ఆత్మహత్య)
వరుసగా మూడు బహుమతులు సాధించడంతో ఎడ్లకు మంచి గిరాకీ వచ్చిందన్నారు. నాలుగు ఎడ్లకు సుమారు రూ.35 లక్షలు పలుకుతుందన్నారు. బహుమతి సాధించి వచ్చిన కొన్ని గంటల్లోనే ఇలా ఎవరు చేశారో అర్థం కావడం లేదని రైతు బోరున విలపించాడు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే పట్టణ పరిధిలోని రైతులంతా అక్కడకు చేరుకున్నారు. ఆ ఎడ్లకు అరటి పండులో విషం పెట్టి తినిపించి ఉండొచ్చని పశు సంవర్ధక శాఖ ఏడీ వై.శ్రీనివాసరావు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సామర్లకోట ఎస్సై సుమంత్ కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, రైతు సంఘం అ«ధ్యక్షుడు కంటే బాబు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి ఆవాల లక్ష్మీనారాయణ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గోలి వెంకట అప్పారావు చౌదరి పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment