Pakistan Model Qandeel Baloch Murder Case: Model Brother Acquitter In Honour Killing - Sakshi
Sakshi News home page

సోదరిని దారుణంగా చంపి జైలుకెళ్లాడు.. బయటకు రాగానే బ్యానర్లతో భారీ ఊరేగింపు.. ‘హీరో’ అంటూ జేజేలు!

Published Tue, Feb 15 2022 5:35 PM | Last Updated on Tue, Feb 15 2022 7:23 PM

Pak Model Qandeel Baloch Brother Acquitted In Honour Killing Case - Sakshi

సోషల్​ మీడియాలో సెన్సేషన్​, పాక్​ పూనం పాండేగా పేరున్న క్వాందీల్​​ బలోచ్ హత్య ఉదంతం.. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అశ్లీల వీడియోలను ఇంటర్నెట్​లో పోస్ట్​ చేస్తూ కుటుంబం పరువు తీస్తోందంటూ తోడబుట్టినవాడే 2016, జులైలో ఆమెను దారుణంగా హతమార్చారు. అయితే ఇంతకాలం జైలుశిక్ష అనుభవించిన ఆమె సోదరుడు.. సోమవారం జైలు నుంచి బయటకు వచ్చాడు. ఆ సమయంలో ఊరేగింపుగా జనం ఇంటికి తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు.​

ఫౌజియా అజీమ్ అలియాస్​ క్వాందీల్​​ బలోచ్ అలియాస్​ కందిల్​ బలోచ్​.. పాక్​ తొలి సోషల్​ మీడియా సెలబ్రిటీ. భర్త నుంచి విడిపోయాక ఆమె.. హాట్​ ఫొటోలు, వీడియోలతో పేరు సంపాదించుకుంది. ఈ క్రమంలో భారత క్రికెటర్లు, సినీ తారల పేర్లను సైతం ఆమె ఉపయోగించుకుంది. ఇదిలా ఉండగా..ఆపై ఆమె పరివర్తనలో మార్పొచ్చింది. ఉద్యమకారిణిగా పలు అంశాలపై పోరాడింది. ఇదిలా ఉండగా..  2016లో క్వాందీల్​(26) దారుణంగా హత్యకు గురైంది. అశ్లీల ఫొటోలు, వీడియోలతో తమ కుటుంబ పరువు తీస్తున్నందువల్లే తన సోదరిని హతమార్చానని బలోచ్​ సోదరుడు వసీమ్ ప్రకటించాడు. అంతేకాదు ఇందుకు తానేం బాధపడడం లేదని, ఆమె హద్దులు దాటిందంటూ తన చర్యను సమర్థించుకున్నాడు కూడా. ఈ కేసులో వసీమ్​కు జీవిత ఖైదు పడింది.

ఈ హత్య ఉదంతం మడోనా లాంటి పాప్​ సింగర్​ దగ్గరి నుంచి ఎంతో మంది సెలబ్రిటీలను కదిలించింది. ఆడవాళ్ల స్వేచ్ఛ.. దానికి ఉండాల్సిన పరిధులపైనా విస్తృత స్థాయిలో చర్చ జరిగింది కూడా. పాక్​లో ఇలాంటి నేరాలకు చట్ట సవరణ పై చర్చ జరగ్గా.. చట్టాలకు కీలకమైన మార్పులు సైతం జరిగాయి. అదే టైంలో ఇలాంటి కేసుల్లో క్షమాభిక్షలు ఇవ్వకూడదనే డిమాండ్​ బలంగా వినిపించింది. మరోవైపు తమ కుమార్తె హత్య కేసులో కొడుకు వసీంను క్షమించే ప్రసక్తే లేదని తొలుత ఆ పేరెంట్స్​ వ్యాఖ్యానించారు కూడా. చివరికి.. క్షమాభిక్షకు ఒప్పుకోవడంతో ఆరేళ్ల శిక్షా కాలం పూర్తి కాకముందే వసీం బయటకు వచ్చేశాడు. 



బలోచ్ ను హత్య చేసినందుకు గర్వంగా భావిస్తున్నానని, అందుకు భావితరాలు తనను గుర్తుంచుకుంటాయని మహ్మద్ వసిమ్ అరెస్ట్​ అయిన సమయంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రిలీజ్​ అయ్యాక కూడా అతని పరివర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. స్థానిక మీడియాకు అదే మాట చెప్పాడు. ఇక ముల్తాన్​ సిటీలోని అతనుండే ఏరియా మొత్తం వసీమ్​ను ‘హీరో’గా అభివర్ణిస్తోంది. పైగా అమ్మాయిలు జన్మించేది ఇంట్లో ఉండేందుకని, వారు సంప్రదాయాలు పాటించాలని, ఆ విషయంలో దారి తప్పితే వసీమ్​ లాంటి హీరోలు పుట్టుకొస్తారంటూ బ్యానర్లు, ఫ్లెక్సీలు సైతం ప్రదర్శించడం విశేషం. ఇంట్లో వాళ్లు అతన్ని రానివ్వకపోవడంతో.. అదే ఏరియాలో మరో అద్దె ఇంట్లో దిగాడు వసీమ్​ ఇప్పుడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement