సాక్షి, భీమవరం : పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో బాలిక హత్య కలకలం రేపింది. సొంత బాబాయే బాలికను హత్య చేసి ఉంటాడని స్థానికులు, పోలీసులు అనుమానిస్తున్నారు. తమ కుమార్తె కనబడటం లేదని పోలీసులను ఆశ్రయించి.. అల్లాడిపోతున్న తల్లిదండ్రులకు వారి ఇంటి వెనుక ఉన్న తుప్పల్లోనే శవమై కనిపించింది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. భీమవరానికి చెందిన ములుపు అంజి, దుర్గ దంపతులకు ఒక్కగానొక్క కుమార్తె రత్నకుమారి(14).
పట్టణంలోని ఓ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. కూలి పనులు చేసుకునే వారు తమ బిడ్డను చదివించుకుంటున్నారు. వీరి ఇంటివద్దనే బాలిక బాబాయి ములుపు మావుళ్లు నివసిస్తున్నాడు. కొన్ని రోజులుగా రత్నకుమారికి ఆరోగ్యం బాగోకపోవడంతో పాఠశాలకు వెళ్లకుండా ఇంటివద్దనే ఉంటోంది. ఈ నెల 26న రత్నకుమారి తల్లిదండ్రులు యథావిధిగా పనులకు వెళ్లారు. సాయంత్రం ఇంటికొచ్చే సరికి కుమార్తె లేదు. చుట్టుపక్కల వారిని ఆరా తీసినా ఆమె జాడ తెలియలేదు. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
బాలిక తండ్రితో పాటు మావుళ్లు కూడా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. దిశ పోలీసులకు తన ఫోన్ నుంచి ఫిర్యాదు కూడా చేశాడు. మావుళ్లు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా అతని భార్య కువైట్‌లో ఉంది. అతని ఇద్దరు పిల్లలు నరసాపురంలోని హాస్టల్లో ఉంటున్నారు. రెండు రోజులుగా అతని ప్రవర్తన పట్ల అనుమానం రావడంతో కొంతమంది యువకులు ప్రత్యేక నిఘా వేశారు. మావుళ్లు వేరొకరి ఇంటి నుంచి పార తేవడంతో అనుమానం మరింత బలపడింది. మూడు రోజులుగా బాలిక ఆచూకీ తెలియకపోవడంతో బాలిక తండ్రి అంజి మరికొంత మందితో కలసి గురువారం ఉదయం ఇంటి వెనుక తుప్పలు, జమ్ముతో ఉన్న ప్రాంతంలో వెతికేందుకు వెళుతుండగా.. అక్కడ ఉండదు.. అటు వెళ్లొద్దంటూ మావుళ్లు అడ్డుకునే ప్రయత్నం చేశాడు.
అయినప్పటికీ వారు వెళ్లి చూడగా బాలిక మృతదేహం కనిపించింది. బాలికను బాబాయే ఇంట్లో చంపేసి ఆ తర్వాత మృతదేహాన్ని తుప్పల్లో పడేసి ఉంటాడని భావిస్తున్నారు. పోలీసుల విచారణలో నిజానిజాలు తేలాల్సి ఉంది. పోస్టుమార్టం అనంతరం మరిన్ని వివరాలు తెలిసే అవకాశముందని స్థానికులు భావిస్తున్నారు. కాగా, బాలిక మృతదేహం లభించిన ప్రాంతాన్ని ఎస్పీ రవిప్రకాష్ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపి సమగ్రంగా విచారించాలని ఆదేశించారు. అనుమానితుడు మావుళ్లును అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment